Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జనవరిలో రాష్ట్ర స్థాయి సదస్సులు
- ఫిబ్రవరి 28న రాష్ట్ర కేంద్రాల్లో ఆందోళనలు
- దేశంలో పెరుగుతున్న దళిత దాడులపై జాతీయ సదస్సు పిలుపు
- ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంపై పుస్తకం విడుదల
న్యూఢిల్లీ : దేశంలోని హిందూత్వ మతోన్మాద, బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా విశాల ఐక్య వేదిక నిర్మాణానికి జాతీయ సదస్సు పిలుపు ఇచ్చింది. అలాగే దళితులపై దాడులకు వ్యతిరేకంగా జనవరిలో రాష్ట్రస్థాయిల్లో సదస్సులు నిర్వహించాలనీ, ఫిబ్రవరి 28న రాష్ట్ర కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించింది. శనివారం నాడిక్కడ హరికిషన్ సింగ్ సూర్జిత్ భవన్లో డీఎస్ఎంఎం, ఏఐడీఆర్‌ఎం, ఏఐఏడబ్ల్యూయూ, బీకేఎంయూ, ఏఐఏఆర్ఎల్ఏ ఆధ్వర్యంలో ''దేశంలో పెరుగుతున్న దళితులపై దాడులు'' అనే అంశంపై జాతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు రామచంద్రడోమ్ (డీఎస్ఎంఎం), బి.వెంకట్ (ఏఐఏడబ్ల్యుయూ) అధ్యక్షత వహించారు. తొలుత దేశంలో వివిధ ఘటనల్లో మరణించిన వారికి నివాళులర్పించారు. సదస్సును రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, సఫాయి కర్మచారి ఆందోళన్ (ఎస్కేఏ) జాతీయ కన్వీనర్ బెజవాడ విల్సన్ ప్రారంభించారు. డీఎస్ఎంఎం నేత సుభాషిణీ అలీ దళితులపై దాడులు తదితర అంశాలకు సంబంధించిన ఐదు పేజీల తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీన్ని సదస్సు ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా బెజవాడ విల్సన్ మాట్లాడుతూ దేశంలో దళితులపై క్రమ పద్దతిలో దాడులు జరుగుతున్నాయనీ, వీటిని ఎదుర్కొవడానికి అందరూ ఐక్యంగా ఉద్యమించాలని అన్నారు. ఉపాధిలో దళితులకు అన్యాయం జరుగుతోందనీ, గౌరవప్రదమైన ఉపాధి దక్కడం లేదని పేర్కొన్నారు. ఉన్నత విద్యాసంస్థల్లోనూ వివక్షకు గురవుతున్నారనీ, 2014-21 మధ్య ఉన్నత విద్యా సంస్థల్లో 122 మంది ఆత్మహత్యలు చేసుకుంటే, అందులో 24 మంది దళితులేనని తెలిపారు. కొత్త జాతీయ విద్యా విధానం దళితులకు వినాశకరమని, ప్రయివేటీకరణకారణంగా ప్రభుత్వ రంగంలో ఉద్యోగ రిజర్వేషన్లు కుదించుకుపోతున్నాయని అన్నారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై దాడులు పెరుగుదల : సుభాషిణీ అలీ
దేశంలో ఒకపక్క దళితులపై దాడులు పెరుగు తున్నాయనీ, మరోపక్క మోడీ సర్కార్ అమృత్ వేడుకలు నిర్వహిస్తోందని డీఎస్ఎంఎం ఉపాధ్యక్షురాలు సుభాషిణీ అలీ విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో కార్పొరేట్ అనుకూల, మతోన్మాద విధానా లను అవలంభి స్తోందని దుయ్యబట్టారు. దళితుల హక్కులు, జీవనోపాధిపై దాడి చేస్తోందని ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని తిరస్కరిం చిన ఆర్ఎస్ఎస్, రాజ్యాంగం కల్పించిన హక్కులను కూడా తిరస్కరిస్తోందని విమర్శించారు. దేశంలో అన్ని వర్గాలు కార్మిక, రైతు, దళిత, ఆదివాసీ, మైనార్టీ, మహిళల హక్కులపై దాడి జరుగుతుందని పేర్కొన్నారు. దళితులపై జరుగుతున్న నేరాలు 2011లో 33,719 ఉంటే, 2020 నాటికి 50,291 చేరిందని అన్నారు. 2017 - 2018 మధ్య ఎస్సిలపై 27.3 శాతం, ఎస్టిలపై 20.3 శాతం నేరాలు పెరిగాయని తెలిపారు. గత పదేండ్లలో బీజేపీ పాలిత (ఏపి మినహా) రాష్ట్రాల్లోనే దళితులపై దాడులు జరిగాయనీ, యూపీలో 95,751, బీహార్‌లో 63,116, రాజస్థాన్‌లో 58,945, మధ్యప్రదేశ్‌లో 44,469, ఆంధ్రప్రదేశ్‌లో 26,881 దాడులు జరిగాయని తెలిపారు. దేశంలో 80 శాతం మంది దళితులకు భూమి లేదని, వారందరికీ భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేరళ ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కె. రాధాకృష్ణన్, కేరళ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ చిట్టయం గోపకుమార్, మాజీ ఎంపీ రాజ్ కుమార్ సైనీ, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ రతన్ లాల్, మాజీ ఎంపి అలీ అన్వర్, జిఎస్ గోరియా (బీకేఎంయూ), అభిరాణి (ఏఐఎండీఏఎం), భగవంత్ సుమౌ (ఎఐఎఆర్ఎల్ఎ) తదితరులు మాట్లాడారు. సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకరత్, ఎమ్మెల్యే కె శాంతకుమారి (డీఎస్ఎంఎం), విక్రమ్ సింగ్ (ఎఐఎడబ్ల్యు యు), ఏపి, తెలంగాణ కెవిపిఎస్ నేతలు ఆండ్ర మాల్యాద్రి, జి రాంబాబు, జాన్ వెస్లీ, స్కైలాబ్, డిఎస్పిఎస్ నేతలు సుబ్బారావు, ప్రభాకర్‌లు పాల్గొన్నారు.
డిమాండ్లు
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం బలోపేతం చేయాలి. ప్రయివేటీకరణ ఆపాలి. కాంట్రాక్ట్, తాత్కాలిక కార్మికులను రైగ్యులరైజ్ చేయాలి. ప్రైవేట్ రంగంలోని రిజర్వేషన్లు తప్పని అమలు చేయాలి. ఎస్సి, ఎస్టి కోటా తగ్గించకుండా, దళిత ముస్లీం, క్రైస్తవులకు రిజర్వేషన్లు ఇవ్వాలి. ఎస్సి, ఎస్టి సబ్‌ప్లాన్‌ను పునరుద్ధరించి, అమలు చేయాలి. నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలి. సంస్థాగత హత్యాలకు వ్యతిరేకంగా చట్టం తీసుకురావాలి. ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని అమలు చేయాలి. భూమి లేని పేదలకు భూ పంపిణీ చేయాలి.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంపై పుస్తకం విడుదల
''ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం-1989 సమగ్ర పరిశీలన'' పుస్తకాన్ని కేరళ ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కె. రాధాకృష్ణన్, కేరళ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ చిట్టయం గోపకుమార్ విడుదల చేశారు. సుప్రీం కోర్టు న్యా య వాది పొత్తూరి సురేష్ కుమార్ రాసిన పుస్తకాన్ని కెేవీపీ ఎస్ ఏపీ రాష్ట్ర కమిటీ, డీఎస్ఎంఎంలు ప్రచురించాయి.