Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసమానతల్ని పెంచేలా పాలకుల విధానాలు
- కేంద్ర నిధుల పంపిణీ..క్షేత్రస్థాయికి చేరాలి : నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ
న్యూఢిల్లీ : ఎన్నికలవేళ ఉచిత పథకాల ప్రకటన కన్నా..ధనికులపై పన్నులు పెంచాలని నోబెల్ గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ అన్నారు. భారత్లో పాలకులు ఎంచుకున్న ఆర్థిక విధానాలు అసమానతల్ని మరింత పెంచుతున్నాయని, కేంద్ర నిధులు కిందిస్థాయికి వెళ్లేలా చర్యలు చేపట్టాలని సూచించారు. న్యూఢిల్లీలో ఏర్పాటుచేసిన ఒక సమావేశంలో 'గుడ్ ఎకనామిక్స్, బ్యాడ్ ఎకనామిక్స్' అనే అంశంపై మాట్లాడుతూ ఆయన పై వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ప్రకటించే ఉచిత పథకాలతో పేదలకు మేలు జరగదన్నారు. అసమానతలు తగ్గించడానికి, పేదలకు మేలు చేయడానికి ఉచిత పథకాలు సాయం చేయవని చెప్పారు. అసమానతలు, పేదరికాన్ని ఎదుర్కోవాలంటే సరైన ఆర్థిక విధానాలు, క్రమశిక్షణ అవసరమన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, మహిళల ఆర్థిక స్వేచ్ఛ..తదితర అంశాలపై అభిజిత్ బెనర్జీ తన అభిప్రాయాల్ని పంచుకున్నారు. ''ఎన్నికల సమయంలో ఉచిత పథకాలు ప్రకటించటం అలవాటై పోయింది. ఇప్పుడు దాని నుంచి బయటపడటం చాలా కష్టమైన ఆట. అత్యంత ధనికులు, బడా కార్పొరేట్లు తీసుకున్న బ్యాంకు రుణాలు మొండి బకాయిలుగా మారుతున్నాయి. అతిపెద్ద రుణ గ్రహీతలెవరూ పేదవారు కాదు. మనకు చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వ నిధులు కిందిస్థాయికి వెళ్లేలా ప్రణాళిక చేయాలి'' అని అన్నారు.
అసమానత్వం విజృంభిస్తోంది..
నిజమైన వేతనాలు పడిపోతున్నాయి. చిన్న కార్లకు డిమాండ్ తగ్గిపోయింది. లగ్జరీ కార్ల విభాగాలు అమ్మకాలు అనూహ్యంగా పెరిగాయి. ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా ఇంధన ధరలు మండిపోతున్నాయి. నిత్యావసర వస్తువుల ద్రవ్యోల్బణం పేదలపై ప్రభావం చూపుతోంది. ఇప్పుడు మనం అసమానతలు పెరిగే దశలో ఉన్నాం. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి మేక్ ఇన్ ఇండియా మొదలుపెట్టాం. 98శాతం అభ్యర్థులు ఉద్యోగాలు పొందలేకపోతు న్నారు. యువతలో పెద్ద ఎత్తున నిరుద్యోగం నెలకొంది.