Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడు బైపోల్స్‌లో నాలుగు గెలుపు...
న్యూఢిల్లీ : దేశంలోని ఆరు రాష్ట్రాల్లో ఏడు అసెంబ్లీ స్థానాల ఫలితాలను ఆదివారం కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో మూడు స్థానాల్లో బీజేపీ ఓటమి పాలవ్వగా.. నాలుగు స్థానాల్లో గెలిచింది. తెలంగాణలో బీజేపీకి బిగ్‌షాక్ తగిలింది. ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల ఈనెల 3న జరిగాయి. తెలంగాణలో అధికార టీఆర్ఎస్, యూపీ, హర్యానాల్లో అధికార బీజేపీ, మహారాష్ట్రలో ఉద్ధవ్ శివసేన, ఒడిశాలో బీజేపీ గెలిచాయి. బీహార్‌లో రెండు స్థానాలకు ఆర్జేడీ, బీజేపీ చెరోకటి సొంతం చేసుకున్నాయి. అయితే ప్రాంతీయ పార్టీల నుంచి ఆ పార్టీకి గట్టి పోటీ ఎదురైంది. తెలంగాణాలో టీఆర్ఎస్, ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, బీహార్‌లో ఆర్జేడీ, ఒడిశా బీజేపీ, హర్యానాలో కాంగ్రెస్ పార్టీలు బీజేపీని తీవ్రంగా ప్రతిఘటించాయి.
బీహార్‌లో చెరొకటి...
బీహార్‌లోని గోపాల్ గంజ్, మొకామా రెండు స్థానాలకు గానూ ఆర్జేడీ, బీజేపీ చెరొక్కటి కైవసం చేసుకున్నాయి. మొకామా నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సోనం దేవి (63,003)పై ఆర్జేడీ అభ్యర్థి నీలం దేవి (79,744) 16,741 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. గోపాల్ గంజ్ నియోజకవర్గంలో ఆర్జేడీ అభ్యర్థి మోహన్ ప్రసాద్ గుప్తా (68,259)పై బీజేపీ అభ్యర్థి కుసుమ్ దేవి (70,053) కేవలం 1,794 ఓట్ల మెజార్టీతో గెలిపొందారు. మొకామా అనంత్ కుమార్ సింగ్‌పై ఎన్నికల కమిషన్ అనర్హత వేటు వేయడంతో ఈ ఉప ఎన్నిక జరిగింది. అనంత్ కుమార్ సింగ్ సతీమణి నీలం దేవి పోటీ చేసి ఘన విజయం సాధించారు. బీజేపీ ఎమ్మెల్యే సుభాశ్ సింగ్ మరణించడంతో గోపాల్‌గంజ్ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. ఆయన సతీమణి కుసుమ్ దేవి పోటీ చేసి, గెలిపొందారు.
మహారాష్ట్రలో ఉద్ధవ్ శివసేన ఘన విజయం
మహారాష్ట్రలోని తూర్పు అంధేరీ శాసన సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన అభ్యర్థి రుతుజ లట్కే ఘన విజయం సాధించారు. శివసేన ఎమ్మెల్యే రమేశ్ లట్కే ఈ ఏడాది మే నెలలో మరణించడంతో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. ఆయన సతీమణి రుతుజ లట్కే ముంబాయి నగర పాలక సంస్థలో ఉద్యోగిగా రాజీనామా చేసి ఎన్నికల బరిలోకి దిగారు. అయితే ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలేవీ బరిలో దిగలేదు. కాంగ్రెస్, ఎన్సీపీ, ఎంఎన్ఎస్ కూడా రుతుజకు మద్దతు పలికాయి. బీజేపీ పోటీ చేయలేదు. అయితే రుతుజ ఆరుగురితో తలపడింది. రుతుజకు 66,530 ఓట్లు రాగా, నోటాకు 12,806 ఓట్లు వచ్చాయి. ఆమె 64,959 ఓట్ల మెజార్టీతో గెలిపొందారు. దీంతో ఆమె ప్రత్యర్థిగా నోటా నిలిచింది. ఆరుగురు అభ్యర్థులకు 600 నుంచి 1,600 మధ్యే ఓట్లు పోలయ్యాయి. శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) పార్టీ టార్చిలైట్ గుర్తుతో మొదటి సారిగా పోటీ చేసి గెలిచింది.
ఉత్తరప్రదేశ్, హర్యానా, ఒడిశాలో బీజేపీ
ఉత్తరప్రదేశ్‌లోని గోలా గోకరణ్నాథ్ శాసన సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అమన్ గిరి ఘన విజయం సాధించారు. ఆయన తండ్రి అరవింద్ గిరి మరణంతో ఈ ఉప ఎన్నికలు జరిగాయి. బీజేపీ అభ్యర్థి అమన్ గిరి (1,24,810), ప్రతిపక్ష ఎస్పీ అభ్యర్థి వినరు తివారీ (90,512)పై 34,298 ఓట్ల మెజార్టీతో గెలిచారు. హర్యానాలో అదంపూర్ శాసన సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి భవ్య బిష్ణోరు ఘన విజయం సాధించారు. 29 ఏండ్ల భవ్య బిష్ణోరు (67,492), కాంగ్రెస్ అభ్యర్థి జయప్రకాష్ (51,752)పై 15,740 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. భజన్ లాల్ కుమారుడు కుల్దీప్ బిష్ణోరు ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, బీజేపీలో చేరడంతో ఈ ఉప ఎన్నిక జరిగింది. కుల్దీప్ కుమారుడే భవ్య బిష్ణోరు. అయితే ఇక్కడ బీజేపీ, జేజేపీ కలిసి అభ్యర్థిని నిలబెట్టాయి. ఒడిశాలో ధామ్ నగర్ శాసన సభ స్థానంలో బీజేపీ గెలిచింది. బీజేపీ అభ్యర్థి సూర్యబంషి సూరజ్ (80,351), బీజేడీ అభ్యర్థి అబంతి దాస్ (70,470) 9,881 ఓట్ల మెజార్టీతో గెలిపొందారు. బిజెపి ఎమ్మెల్యే బిష్ణు చరణ్ సేథీ మరణంతో ఉప ఎన్నిక జరిగింది. బీజేపీ తన అభ్యర్థిగా సేథి కుమారుడు సూర్యబన్షి సూరజ్‌ను బరిలోకి దింపింది.