Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఏపీ మాజీ మంత్రి వై.ఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె, ప్రముఖ వైద్యురాలు నర్రెడ్డి సునీత క్యాపిటల్ ఫౌండేషన్ జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. న్యాయ, వైద్యం, సైన్యం, ఆర్థిక, కళా రంగాల్లో విశేషమైన సేవలు అందించిన పలువురికి క్యాపిటల్ ఫౌండేషన్, జస్టిస్ కృష్ణయ్యర్ ఉచిత న్యాయసేవల విభాగంతో కలిసి జాతీయ అవార్డులు ప్రదానం చేసింది. ఆదివారం నాడిక్కడ ఇండో ఇస్లామిక్ కల్చరల్ సెంటర్ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో సుప్రీం ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ యుయు లలిత్... డాక్టర్ సర్రెడ్డి సునీతకు జాతీయ అవార్డును అందజేశారు. ఆమె వైద్యరంగంలో చేసిన సేవలకు గానూ క్యాపిటల్ ఫౌండేషన్ ఈ పురస్కారం ప్రదానం చేసింది. మాజీ అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్‌కు జీవన సాఫల్య పురస్కారం, హైదరాబాద్‌కు చెందిన పురాతన కార్ల సేకర్త (కళా రంగం) రామ్‌లాల్ అగర్వాల్‌కు క్యాపిటల్ ఫౌండేషన్ జాతీయ పురస్కారాన్ని జస్టిస్ యుయు లలిత్ అందజేశారు. అలాగే వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న 15 మందికి జాతీయ అవార్డును అందజేశారు. కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మెన్ జస్టిస్ ఎకె పట్నాయక్, అటార్నీ జనరల్ వెంకటరమణి, వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు, బీజేపీ రాజ్యసభ సభ్యుడు సస్మిత్ పాత్రా, పలువురు మాజీ న్యాయమూర్తులు, సుప్రీం కోర్టు న్యాయవాదులు పాల్గొన్నారు.
టీబీతోనే అత్యధిక మరణాలు : డాక్టర్ నర్రెడ్డి సునీత
టీబీతోనే అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయని ప్రముఖ వైద్యురాలు నర్రెడ్డి సునీత తెలిపారు. క్యాపిటల్ ఫౌండేషన్ జాతీయ పురస్కారం అందుకున్న తరువాత ఆమె మీడియాతో మాట్లాడారు. కరోనా సమయంలో టీబీ సహా ఇతర అంటువ్యాధుల విషయాన్ని అంతా విస్మరించారని తెలిపారు. టీబీ, డెంగీ, కరోనా, హెచ్ఐవి అన్నీ అంటువ్యాధులేనన్నారు. టీబీ వేల సంవత్సరాలుగా ఉన్నా నేటికీ దానికి చికిత్స అందించడం సవాల్‌గానే ఉందని అన్నారు. 15 ఏండ్ల కిందటితో పోల్చితే ప్రస్తుతం టీబీ చికిత్సలో ఎన్నో మార్పులు వచ్చాయని తెలిపారు. టీబీ రోగులకు ఎంతో చేయూతనివ్వాల్సి ఉంటుందన్నారు. టీబీ వ్యాప్తిని అరికట్టగలిగితే సమాజానికి ఎంతో మేలు కలుగుతుందన్నారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం డెంగీపై పరిశోధనలు సాగుతున్నాయన్నారు.