Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 10 శాతం రిజర్వేషన్ల రాజ్యాంగ సవరణపై..
న్యూఢిల్లీ: ఆర్థికంగా వెనుకబడిన వర్గానికి (ఈడబ్ల్యూఎస్) 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చేసిన 103 రాజ్యాంగ సవరణ రాజ్యాంగ చెల్లుబాటుపై నేడు (సోమవారం) సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వనుంది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు లలిత్, న్యాయమూర్తులు జస్టిస్ దినేష్ మహేశ్వరీ, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్, జస్టిస్ బీలా ఎం త్రివేది, జస్టిస్ జెబి పార్దీవాలాలతో కూడిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇవ్వనున్నది. రిజర్వేషన్లకు ఆర్థిక వర్గీకరణ మాత్రమే ప్రాతిపదిక కాదనే కారణంతో ఈ సరవణను సవాల్ చేస్తూ జనహిత్ అభియాన్, యూత్ ఫర్ ఈక్వాలిటీ తదితర సంస్థలు పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్లపై వరుసగా ఏడు రోజుల పాటు సుదీర్ఘంగా విచారించిన సుప్రీం కోర్టు, సెప్టెంబర్ 27న విచారణ ముగించింది. ఈ సవరణ రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణాన్ని ఉల్లంఘిస్తోందనీ, ఇంద్ర సాహ్ని కేసులో నిర్దేశించిన ప్రకారం మొత్తం 50 శాతం రిజర్వేషన్లను ఉల్లంఘించిందని పిటిషనర్లు వాదించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు కాకుండా ఈడబ్ల్యుఎస్లకు 10 శాతం రిజర్వేషన్ ఏకపక్షంగా ఉన్నదని తెలిపారు. అప్పటి అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ సవరణను సమర్థిస్తూ రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణాన్ని ఎక్కడా ఉల్లంఘించలేదని పేర్కొన్నారు.