Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం తీర్పు
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యుఎస్)కు 10శాతం రిజర్వేషన్ కోటాను ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సమర్థించింది. విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఈ కోటా కింద రిజర్వేషన్లను ప్రవేశపెడుతూ చేసిన 103వ రాజ్యాంగ సవరణ చెల్లుబాటుకు ధర్మాసనం 3:2 మెజారిటీతో ఆమోదించింది. 10శాతం కోటాను జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ బేల ఎం త్రివేది, జస్టిస్ జెబి పార్దీవాలాలు సమర్థించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు లలిత్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ దీనిపై భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు. ఈడబ్ల్యుఎస్కు 10 శాతం కోటా కల్పిస్తూ 103 రాజ్యాంగ సవరణ బిల్లును 2019 జనవరిలో పార్లమెంట్ ఆమోదం పొందింది. దీన్ని సవాల్ చేస్తూ జన్హిత్ అభియాన్, యూత్ ఫర్ ఈక్వాలిటీ తదితర సంస్థలు పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటీషన్లపై వరుసగా ఏడు రోజులపాటు సుదీర్ఘంగా విచారించిన అత్యున్నత న్యాయస్థానం సెప్టెంబర్ 27న విచారణ ముగించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ యుయు లలిత్, న్యాయమూర్తులు జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, జస్టిస్ బేల ఎం త్రివేది, జస్టిస్ జెబి పార్దీవాలాతో కూడిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పును సోమవారం వెల్లడించింది.
50 శాతం సీలింగ్ అనువైనది కాదు : జస్టిస్ దినేష్ మహేశ్వరి
''సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వారిని ప్రధాన జీవన స్రవంతిలోకి చేర్చడానికి రిజర్వేషన్ ఒక సాధనమా? రిజర్వేషన్ సమతా సమాజం లక్ష్యాల వైపు అందరినీ కలుపుకొని వెళ్లేలా చేస్తుంది. ఇది ఏ వర్గాన్నైనా వెనుకబాటు నుంచి బయటకు పంపడానికి ఒక సాధనం. ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు దేశ ప్రాథమిక నిర్మాణాన్ని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించవు. ఎందుకంటే ఇది ఆర్థిక ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది. ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్ సమానత్వ కోడ్ను ఉల్లంఘించదు. 50 శాతం సీలింగ్ అనువైనది కాదు. అందువల్ల పరిమితి, ప్రాథమిక నిర్మాణాన్ని ఉల్లంఘించినట్టు కాదు. సీలింగ్ పరిమితి 15(4), 15(5), 16(4) ద్వారా కల్పించిన రిజర్వేషన్లకు మాత్రమే వర్తిస్తుంది'' అని పేర్కొన్నారు.
పున్ణసమీక్షించాలి : జస్టిస్ బేలా త్రివేది
'స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్ల తరువాత పరివర్తనాత్మక రాజ్యాంగ స్ఫూర్తితో రిజర్వేషన్ల వ్యవస్థను పున్ణసమీక్షించాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగ నిర్మాతలు ఏమి ఊహించారో, 1985లో రాజ్యాంగ ధర్మాసనం ఏమి ప్రతిపాదించిందో, రాజ్యాంగం ఆవిర్భవించి 50 ఏండ్లు పూర్తి అయిన తరువాత రిజర్వేషన్ల విధానానికి తప్పనిసరిగా ఏమి సాధించాలనుకుంటున్నారో నేను చెప్పను. స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తి అవుతున్న ఈ దశలో కూడా కాలవ్యవధి ఇంకా సాధించలేకపోయింది' అని జస్టిస్ త్రివేది పేర్కొన్నారు.
రిజర్వేషన్లు నిరవధికంగా కొనసాగవు : జస్టిస్ జెబి పార్దివాలా
ఈడబ్ల్యూఎస్ కోటాను జస్టిస్ జెబి పార్దివాలా సమర్థించారు. 'ఇది సామాజిక, ఆర్థిక అసమానతలను అంతం చేయడం కోసం తీసుకొచ్చారు. బలహీన వర్గాల సామాజిక, విద్యా పరమైన వెనుకబాటుకు దారి తీసిన కారణాలను తొలగించడమే నిజమైన పరిష్కారం. స్వాతంత్య్రం వచ్చిన వెంటనే ప్రారంభమైన కారణాలను తొలగించే కసరత్తు దాదాపు ఏడు దశాబ్దాల క్రితం నుంచి కొనసాగుతూనే ఉంది. దీర్ఘకాల అభివృద్ధి, విద్య అంతరాన్ని తగ్గించడంలో సహాయపడింది. ఫలితంగా వర్గాల మధ్య అంతరాన్ని గణనీయమైన స్థాయిలో ఏకీకృతం చేశాయి' అని తెలిపారు. 'వెనుకబడిన వర్గాలను గుర్తించే పద్ధతి, నిర్ణయించే మార్గాలను సమీక్షించాల్సిన అవసరం ఉంది. వెనుకబాటుతనాన్ని నిర్ణయించే ప్రమాణాలు ప్రస్తుత కాలంలో సంబంధితంగా ఉన్నాయో లేదో కూడా నిర్ధారించడం అవసరం' అన్నారు.
50 శాతం ఉల్లంఘన విభజనకు దారి తీస్తుంది : జస్టిస్ రవీంద్ర భట్
'50 శాతం నిబంధన ఉల్లంఘనను అనుమతించటమంటే.. మరింత ఉల్లంఘనలకు మార్గమవుతుంది. దీని ఫలితంగా విభజన ఏర్పడుతుంది. ఆపై రిజర్వేషన్ల నియమం సమానత్వానికి హక్కుగా మారుతుంది' అన్నారు. 'ఈ సవరణ సామాజిక న్యాయం, తద్వారా ప్రాథమిక నిర్మాణాన్ని బలహీనపరుస్తుంది. రెట్టింపు ప్రయోజనాలను అందించే ఈ సవరణ సరికాదు. ఈ మినహాయింపు సమానత్వ కోడ్ను ఉల్లంఘిస్తుంది. ఆర్థిక అసమానతలు, ఆర్థిక వెనుకబాటుతనం ఈ సవరణకు వెన్నెముక, ఈ సవరణ రాజ్యాంగపరంగా అసాధ్యమైనది. 2001 జనాభా లెక్కల ఆధారంగా రూపొందించబడింది. మొత్తం ఎస్సీ జనాభాలో 38శాతం, మొత్తం ఎస్టీ జనాభాలో 48 శాతం మంది దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారని పేర్కొంది. ఆర్థికంగా వెనుకబడిన వారిలో ఎక్కువ మంది వీరే' అని పేర్కొన్నారు.
రాజ్యాంగ విరుద్ధం-జస్టిస్ యుయు లలిత్
'ఆర్థిక ప్రమాణాల ఆధారంగా రిజర్వేషన్ చెల్లదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలను మినహాయించడం రాజ్యాంగ విరుద్ధం. ఈడబ్ల్యూఎస్ సవరణ మినహాయింపు యంత్రాంగం సామాజికంగా వెనుకబడిన వర్గానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఆ సవరణ వివక్ష తప్ప మరొకటి కాదు. తద్వారా సమానత్వ కోడ్ను నాశనం చేస్తుంది. కాబట్టి ఈ సరవణను వ్యతిరేకిస్తున్నాను' అని జస్టిస్ యుయు లలిత్ పేర్కొన్నారు. రవీంద్ర భట్ తీసుకున్న అభిప్రాయంతో తాను ఏకీభవిస్తున్నానని చెప్పారు.