Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్ చట్టంలోని నిబంధనలు ఆమోదయోగ్యం కాదని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన తరువాత సీపీఐ(ఎం) కేంద్ర కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్లో ఈ సవరణ చర్చకు వచ్చి నప్పుడు కూడా నిబంధనలను సవరించాలని తమ పార్టీ డిమాండ్ చేసిందని తెలిపారు. రూ.8 లక్షల ఆదాయ పరిమితి చట్టంలో ఆమోదయోగ్యం కాదనీ, నైపుణ్యం లేని కార్మికులు ఏండ్ల తరబడి డిమాండ్ చేస్తున్నా కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని అడుగుతున్నా, కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదని తెలిపారు.
ఈ మొత్తం కలిపితే వార్షిక వేతనం మూడు లక్షల పన్నెండు వేల రూపాయలు అవుతోందనీ, ఎనిమిది లక్షల పరిమితిలో భారీ వ్యత్యాసం ఉందని తెలిపారు. 8 లక్షల పరిమితిని దుర్వినియోగం చేయడం వల్ల అనర్హులకు ప్రయోజనాలు అందుతాయని పేర్కొన్నారు. దీనిని పరిష్కరించి అర్హులకు రిజర్వేషన్ ప్రయోజనాలు కల్పించాలని ఏచూరి స్పష్టం చేశారు. జనాభాలో 52 శాతం ఉన్న ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించినప్పుడు, సహజంగానే కుల గణన కోసం డిమాండ్ తలెత్తుతుందని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్న నిబంధనలను ఉల్లంఘించిందన్నారు. జనాభా లెక్కలతో పాటు కుల గణన కూడా నిర్వహించా లనేది తమ పార్టీ వైఖరి అని స్పష్టం చేశారు.
రిజర్వేషన్ పేదరిక నిర్మూలన కార్యక్రమం కాదు : ఎంకె స్టాలిన్
ఈడబ్ల్యూఎస్ కోటాను సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సామాజిక న్యాయం కోసం జరుగుతున్న శతాబ్దపు పోరాటానికి ఎదురుదెబ్బ అని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ అన్నారు. ఈడబ్ల్యూఎస్ కోటా అనే సామాజిక అన్యాయాన్ని ఎదుర్కోవడానికి, పోరాటా న్ని ముందుకు తీసుకెళ్ళడానికి సారూప్య పార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తాయని అన్నారు. రిజర్వేషన్ అనేది పేదరిక నిర్మూలన కార్యక్రమం కాదని పేర్కొన్నారు.
స్వాగతిస్తున్నాం- కాంగ్రెస్
ఆర్థికంగా బలహీన వర్గాల వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రారంభించిన ఈ ప్రక్రియ ఫలితంగా రిజర్వేషన్లు కల్పించినట్టు పేర్కొంది. ఈ మేరకు సోమవారం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఓ ప్రకటన విడుదల చేశారు. తాజా కుల గణనపై నరేంద్ర మోడీ ప్రభుత్వం తన వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
పేదలకు సామాజిక న్యాయం అందించడమే : బీజేపీ
బీజేపీ సుప్రీంకోర్టు తీర్పును ప్రశంసించింది. దేశంలోని పేదలకు సామాజిక న్యాయం అందించాలనే తన ''మిషన్''లో ప్రధాని నరేంద్ర మోడీ సాధించిన విజయమని అపార్టీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బిఎల్ సంతోష్ అన్నారు.