Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శిక్ష తగ్గించమని కోరితే ఏకంగా రద్దు చేసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : పదేళ్ల నాటి కేసులో ఉరిశిక్ష పడిన ముగ్గురు దోషులను నిర్దోషులుగా పేర్కొంటూ సుప్రీం కోర్టు వారిని సోమవారం విడుదల చేసింది. నిర్భయ కేసుకు కొద్ది నెలలు ముందు 2012లో ఢిల్లీకి చెందిన 19 ఏళ్ల యువతిపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడి, ఆ తర్వాత ఆమెను హింసించి మరీ చంపేశారు. కిడ్నాప్ అయిన కొద్ది రోజుల తర్వాత ఆ ఏడాది ఫిబ్రవరిలో హర్యానాలోని రేవారి జిల్లాలో పొలంలో కుళ్లిపోయిన స్థితిలో యువతి మృతదేహం లభించింది. పదునైన ఆయుధాలతో ఆమెను తీవ్రంగా హింసించినట్లు ఆమె దేహంపై వున్న గాయాలు తెలియజేశాయి. వెంటనే ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. 2014 ఫిబ్రవరిలో ఢిల్లీ ట్రయల్ కోర్టు రవికుమార్, రాహుల్, వినోద్‌లను దోషులుగా పేర్కొంటూ తీర్పు చెప్పింది. వారికి మరణ శిక్షను విధించింది. అదే ఏడాది ఢిల్లీ హైకోర్టు కూడా ఈ మరణ శిక్షను ధ్రువీకరించింది. 'వేట కోసం వెతికే జంతువుల్లా వీరు వీధుల్లో పడి తిరుగుతుంటారని' కోర్టు వ్యాఖ్యలు కూడా చేసింది. ఆ ముగ్గురు హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంని ఆశ్రయించారు. తమ శిక్షను తగ్గించాలని కోరారు. జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో బెంచ్ దీనిపై విచారణ జరిపి వారు ముగ్గురినీ నిర్దోషులుగా ప్రకటించి విడుదల చేసింది. వారికి మరణశిక్షను తగ్గించడాన్ని ఢిల్లీ పోలీసులు సుప్రీంలో వ్యతిరేకించారు. దోషుల వయసు, వారి కుటుంబ నేపథ్యం, గతంలోని వారి క్రిమినల్ రికార్డు వీటన్నింటినీ దృష్టిలో వుంచుకుని శిక్ష తగ్గించాలని డిఫెన్స్ న్యాయవాది వాదించారు. ఈ తీర్పు పట్ల బాధితురాలి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ న్యాయ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. న్యాయం కోసం తాము వచ్చామని, కానీ ఇదొక గుడ్డి న్యాయ వ్యవస్థ అని వ్యాఖ్యానించారు.