Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోర్బీ దుర్ఘటనపై రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు
- సుమోటోగా స్వీకరించిన గుజరాత్ హైకోర్టు
అహ్మదాబాద్ : దేశాన్ని తీవ్రంగా కలచివేసిన గుజరాత్‌లోని మోర్బీ దుర్ఘటనపై ఆ రాష్ట్ర హైకోర్టు స్పందించింది. ఈ దుర్ఘటనను న్యాయస్థానం సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు స్థానిక అధికారులకు నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుత స్థితిపై ఈ నెల 14లోగా నివేదిక అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వార్తల్లో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా విచారించాలని రాష్ట్ర హైకోర్టు నిర్ణయించింది. ఇందులో భాగంగా హైకోర్టు చీఫ్ జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ అశుతోశ్ శాస్త్రితో కూడిన ధర్మాసనం.. ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ, హౌంశాఖ, మోర్బీ మున్సిపల్ కమిషనర్, జిల్లా కలెక్టర్‌తో పాటు ఆ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లకు నోటీసులు పంపింది. ఈ కేసు ఈనెల 14న చేపడతామని తెలిపింది. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి నివేదికను అందజేయాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు హైకోర్టు ధర్మాసనం సూచించింది. మోర్బీ ఘటనపై చర్యలు చేపట్టిన గుజరాత్ సర్కారు.. స్థానిక మునిసిపాలిటీ చీఫ్ ఆఫీసర్ (సీఓ)ను సస్పెండ్ చేసింది. సేఫ్టి సర్టిఫికేట్ లేకుండానే తిరిగి తెరవటంపై మునిసిపల్ అధికారిపై వేటు వేసింది. మోర్బీ విషాద ఘటనలో 135 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే.