Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్పీఆర్ ఆధునీకరణకు మోడీ సర్కారు కసరత్తు
న్యూఢిల్లీ : వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ )ను ముందుకు తీసుకురావడం ద్వారా తన మతోన్మాద ఎజెండాను దేశంపై రుద్దడానికి మోడీ ప్రభుత్వం సిద్ధమౌతోందా? తాజా పరిణామాలు ఈ ప్రశ్నకు అవుననే సమాధానం ఇస్తున్నాయి. కొద్దిరోజలు క్రితం బీజేపీకి చెందిన పశ్చిమబెంగాల్ నేత సువేందు అధికారి సీఏఏ ప్రక్రియ మళ్లీ ప్రారంభమైందంటూ చేసిన వ్యాఖ్యలు ఆ రాష్ట్రంలో దుమారం రేపాయి. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, మోడీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈ అంశాన్ని తెరమీదకు తెచ్చింది. త్వరలో ఎన్నికలు జరగనున్న ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తామని బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలలోనూ చేర్చింది. జాతీయస్ధాయిలో తీసుకోవాల్సిన ఈ నిర్ణయాన్ని ఉద్ధేశ్యపూర్వకంగానే ప్రస్తావిస్తూ, ప్రజలను చీలుస్తున్నారన్న విమర్శలు వస్తుండగానే తాజాగా సోమవారం సీఏఏ కు తొలిమెట్టుగా భావించే జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్పీఆర్) అంశాన్ని ప్రస్తావించింది. ఎన్పీఆర్ను ఆధునీకరించాల్సి ఉందని కేంద్ర హోం మంత్రిత్వశాఖ ప్రకటించింది. సోమవారం ప్రచురించిన 2021-22 వార్షిక నివేదికలో కేంద్ర హోంశాఖ ఈ అంశాన్ని ప్రస్తావించింది. జనన మరణాలు, వలసలు వంటి కారణాలను చూపుతూ ఆధునీకరణ ప్రతిపాదనను సమర్ధించుకుంది. 2015లో ఎన్పీఆర్ వివరాలను సవరించినప్పటికీ, అది చాలదని మరిన్ని కొత్త విషయాలను చేర్చాలని పేర్కొంది. 2015లో కేవలం పేరు, లింగం, తేదీ, పుట్టిన చోటు, నివాస స్థలం, తల్లిదండ్రుల పేర్ల వంటి వివరాలతో పాటు ఆధార్, మొబైల్, రేషన్ కార్డు నెంబర్లను మాత్రమే నమోదు చేశారని, వాటితో పాటు జనన మరణాలు, వలసల కారణంగా చోటుచేసుకున్న మార్పులను ఎప్పటిక ప్పుడు నమోదు చేయాల్సివుందని ఈ ప్రతిపాదనలో కేంద్ర హోంశాఖ పేర్కొంది.