Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) తొలి ఎన్నికల ర్యాలీకి అపూర్వ స్పందన
- హిమాచల్‌లో సభకు తరలి వచ్చిన వేలాది మంది ప్రజలు
- పార్టీ ఎమ్మెల్యే రాకేశ్ సింఘాకు ఓటర్ల నుంచి భారీ మద్దతు
సిమ్లా : హిమాచల్‌ప్రదేశ్‌లో సీపీఐ(ఎం) తొలి ఎన్నికల ర్యాలీకి అక్కడి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రంలో ఆ పార్టీ నిర్వహించిన సభకు ప్రజలు వేలాది మంది స్వచ్ఛందంగా తరలి వచ్చారు. ఎర్ర జెండాలతో సభా ప్రాంగణమంతా కొత్త కళను సంతరించుకున్నది. హిమాచల్‌ప్రదేశ్‌లో సీపీఐ(ఎం) ఏకైక ఎమ్మెల్యే రాకేశ్ సింఘాకు ప్రజలలో మంచి పేరు ఉన్నది. ఆయన సీపీఐ(ఎం) తరఫున సిమ్లా జిల్లాలోని తియోగ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. రాష్ట్రంలో అధికార బీజేపీ ప్రజా వ్యతిరేక, ఏక పక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రజల వైపు నిలబడుతూ ప్రజాకర్షక నాయకుడిగా పేరు సంపాదించుకున్నారు. తన నియోజకవర్గంలో కనీస అసవరాల కోసం పోరాడుతూ బీజేపీ పాలిత రాష్ట్రంలోనూ ప్రజల్లో మంచి పేరును ఆయన గడించారు.
పొటాటో గ్రౌండ్లో ఆయన సీపీఐ(ఎం) తొలి భారీ ర్యాలీని ఏర్పాటు చేశారు. ఈ సభకు సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యురాలు, రాజ్యసభ మాజీ ఎంపీ బృందాకారత్ హజరయ్యారు. అలాగే, రాష్ట్రానికి చెందిన పలువురు సీనియర్ నాయకులూ ఇందులో పాల్గొన్నారు. సింఘాకు మద్దతుగా వేలాది మంది ప్రజలు ఈ సభకు తరలి వచ్చారు. ''నేను ఒంటరినని నాకు తెలుసు. విధాన సభలో మీ గళాన్ని వినిపించటం నా బాధ్యత. నిజానికి, క్రూరమైన సాగు చట్టాలను సభలో ప్రవేశపెట్టినప్పుడు నేను ఆ ప్రతులను విధాన సభలో చించేశాను. ఆ సమయం లో సీఎంకు అందులో(కాగితాల్లో) ఏమున్నదో తెలియదు'' అని ఎన్నికల ర్యాలీకి హాజరైన ప్రజలు, మద్దతుదారులు, కార్యకర్తలను ఉద్దేశిస్తూ సింఘా తెలిపారు.
ప్రజల కోసం ఆందోళనలు చేయటమే సీపీఐ(ఎం) బలమని విమర్శకుల ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. ''మద్యం లేదు, గుండాలు, జేసీబీ సంస్కృతితో హింస లేదు. మా అభ్యర్థులు అన్ని నియోజకవర్గాల్లో ప్రాథమిక అవసరాలను లేవనెత్తుతారు. ఇది తప్పకుండా మాకు తోడ్పడుతుంది. బీజేపీ, కాంగ్రెస్ రాజకీయాలను తిరస్కరించాలి. అణగారిన వర్గాలు, రైతుల కోసం నిలబడిన పార్టీకి ఓటెయ్యాలి'' అని ఓటర్లను కోరారు. ''బీజేపీ పథకాల గురించి మాట్లాడుతున్నప్పుడు ద్రవ్యోల్బణం స్థాయి జీవనోపాధిని కష్టతరం చేసింది. ఆపిల్ ప్యాకేజింగ్‌పై జీఎస్టీ(12శాతం నుంచి 18 శాతం) పెరిగినప్పుడు, గ్యాస్ సిలిండర్ల ధర రూ. 1100 అయినప్పుడు ఈ పథకాలు పట్టింపు లేదు'' అని బృందా కారత్ అన్నారు. ''ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద మేము సిలిండర్లు పొందింది వాస్తవమే. కానీ, దానిని రీఫిల్ చేయించటానికి చాలా ఖర్చవుతుంది'' అని తియోగ్కు చెందిన విమ్లా వాపోయారు.
సభకు వచ్చిన కార్యకర్తలు, సింఘా అభిమానులు నినాదాలు, నృత్యాల, స్థానిక పాటలతో సభా ప్రాంగణాన్ని హౌరెత్తించారు. యువతతో పాటు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు స్థానిక వేషదారణతో అక్కడ కనిపించారు. '' ఈ ర్యాలీ బలాన్ని చూపించటానికి. ఆయన పని తీరు భారీ ప్రజల రూపంలోకి మారింది'' అని పొరుగు నియోజకవర్గ వాసి రాజ్ కపూర్ (53) అన్నారు. ముఖ్యంగా యువత రాజకీయాల్లో సింఘా నిర్భయత్వానికి, పనితీరుకు ఆకర్షితులయ్యారు. ఎమ్మెల్యేను కలిసి శుభాకాంక్షలు తెలపటానికి తియోగ్ డిగ్రీ కాలేజీ విద్యార్థులు అక్కడకు వచ్చారు. ఆయన రాజకీయాలు మాత్రమే కాదు.. అనే ప్రజలను చేరుకుంటున్న తీరు యువతను మరింతగా ఆకర్షించింది. సింఘా.. సిమ్లా నియోజకవర్గం నుంచి 1993లో తొలిసారిగా ఎన్నికయ్యారు. 2012లో తియోగ్ నుంచి పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. 2017లో అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిపై పోటీ చేసి విజయం సాధించారు. రాష్ట్రంలో ఎర్ర జెండాను రెపరెపలాడించారు. హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఈనెల 12న జరగనున్న విషయం తెలిసిందే.