Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీహార్‌లోని కటిహార్‌లో అధికం.. తర్వాత ఢిల్లీ
- సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సమాచారం
- పర్యావరణవేత్తలు, ఆరోగ్య, వైద్య నిపుణుల ఆందోళన
న్యూఢిల్లీ : ఈ ఏడాది భారత్‌లో కాలుష్యం స్థాయిలు తీవ్రంగా పెరిగాయి. దేశంలోని అనేక నగరాలు ఈ సమస్యతో సతమతమవుతున్నాయి. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సమాచారం ఈ విషయాన్ని వెల్లడిస్తున్నది. భారత్‌లోని 163 అత్యంత కాలుష్య నగరాల జాబితాను ఇది విడుదల చేసింది. ఈ సమాచారం ప్రకారం.. బీహార్‌లోని కటిహార్ భారత్‌లోనే అత్యం కాలుష్య నగరంగా ఉన్నది. ఇతర నగరాల కంటే ఇక్కడ అధిక గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) 360గా ఉన్నది. గత కొన్ని రోజులుగా కాలుష్య కోరల్లో చిక్కుకున్న దేశ రాజధాని ఢిల్లీలో ఏక్యూఐ 354గా నమోదైంది. నోయిడా (ఏక్యూఐ 328), ఘజియాబాద్ (ఏక్యూఐ 304) లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అలాగే, అత్యంత కాలుష్య నగరాల్లో బెగుసరారు (బీహార్), బల్లబ్‌గర్, ఫరీదాబాద్, కైతల్, హర్యానాలోని గురుగ్రామ్, మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ లు నిలిచాయి. ఏక్యూఐ ఎంత ఎక్కువగా ఉంటే కాలుష్యం, ఆరోగ్యం అంత ఆందోళనకరంఅని అర్థం. కాగా, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సమాచారం భారత్‌కు ఒక హెచ్చరిక అని పర్యావరణవేత్తలు, నిపుణులు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్టణం, రాజమహేంద్రవరం, ఏలూరు, అనంతపురం నగరాల గాలి నాణ్యత వివరాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. వీటిలో విశాఖపట్టణం (202 పాయింట్లు)లో గాలి నాణ్యత తక్కువగా ఉన్నట్టు నివేదిక వెల్లడించింది. ఇక హైదరాబాద్ (100), అనంతపురం (145), ఏలూరు (61), తిరుపతి (95)గా ఉన్నట్టు తెలిపింది.
భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐఏఆర్ఐ) సమాచారం ప్రకారం పంజాబ్‌లో బుధవారం ఒక్కరోజే 3,634 పంట వ్యర్థాల దహనాలు నమోదయ్యాయి. ఈ ఏడాదిలో ఇదే అత్యధికం కావటం గమనార్హం. వాహన ఉద్గారాలను తగ్గించే యత్నంలో కేంద్ర పర్యావరణ మంత్రి గోపాల్ రారు యూపీ, హర్యానా ముఖ్యమంత్రులకు సూచనలు చేశారు. రాజధాని సరిహద్దులలో ట్రాఫిక్ జాబ్‌ను నివారించటానికి అత్యవసరం కాని గూడ్సును తరలించే ట్రక్కులను దారి మళ్లించాలని కేంద్ర మంత్రి.. సీఎంలను కోరారు. నానాటికి పెరుగుతున్న కాలుష్యం పట్ల ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలనీ, లేకపోతే ఇవి ప్రజల ఆరోగ్యాలపై తీవ్ర ప్రతికూల ప్రభావాలను చూపుతాయని ఆరోగ్య, వైద్య నిపుణులు హెచ్చరించారు. ముఖ్యంగా, శ్వాసకోశ సంబంధ వ్యాధులతో సతమతమవుతున్న వారిని మరింతగా ఇబ్బందుకు గురి చేస్తుందన్నారు. అకాల మరణాలకూ దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.