Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 23వ దఫా ఎన్నికల బాండ్ల అమ్మకానికి తెరలేపిన కేంద్రం
- ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాక.. ఎలా తెస్తారు? : సామాజిక కార్యకర్తలు
- అవినీతిని చట్టబద్ధం చేయటమే..
న్యూఢిల్లీ : గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక... ఎన్నికల బాండ్ల పథకం ద్వారా భారీ మొత్తంలో నిధుల సేకరణకు మోడీ సర్కార్ తెరలేపింది. ఇది ఎన్నికల కోడ్‌ను పూర్తిగా ఉల్లంఘించటమేనని సామాజిక కార్యకర్తలు, ప్రతిపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బాండ్ల పథకం పేరుతో అవినీతిని చట్టబద్ధం చేయటం కాదా? అని ప్రశ్నించారు. సోమవారం బాండ్ల పథకంలో కేంద్ర ఆర్థిక శాఖ కీలక మార్పులు చేసింది. అసెంబ్లీ ఎన్నికలు జరిగే సంవత్సరంలో అదనంగా 15రోజులు, సార్వత్రిక ఎన్నికలు జరిగే ఏడాదిలో అదనంగా 30 రోజులు పథకాన్ని ప్రవేశపెట్టడానికి అవకాశం కల్పించింది. దీంతో సోమవారం 23దఫా బాండ్ల జారీకి ప్రకటన వెలువడింది. అక్టోబర్‌లో 22వ దఫా బాండ్ల అమ్మకాలు జరిగాయి. ఓ వైపు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక..బాండ్ల జారీ గడువు ఎలా పెంచుతారు? అంటూ కేంద్రాన్ని వారు ప్రశ్నించారు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి శనివారం (నవంబర్ 12న) పోలింగ్ జరగనున్నది. డిసెంబర్ 1, 5న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు, ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు డిసెంబర్ 4న జరగనున్నాయి.
పథకం నిబంధనల్లో మార్పులు జరిగిన కొద్ది గంటల్లోనే బాండ్ల అమ్మకంపై ప్రకటన రావటం గమనార్హం. నవంబర్ 9 నుంచి నవంబర్ 15 వరకు దేశవ్యాప్తంగా ఎస్బీఐ కేంద్రాల్లో బాండ్ల అమ్మకాలు జరగనున్నాయి. బ్యాంకుల వద్ద బాండ్లను కొనుగోలు చేయటం ద్వారా పౌరులు, కార్పొరేట్ సంస్థలు, ఎలక్టోరల్ ట్రస్ట్‌లు ఆయా రాజకీయపార్టీలకు విరాళాలు ఇవ్వొచ్చు. విరాళాలు పొందిన రాజకీయ పార్టీలు బాండ్లను క్లెయిమ్ చేస్తూ నగదుగా మార్చుకుంటాయి. ఆ మొత్తాలు సంబంధిత పార్టీ బ్యాంక్ ఖాతాకు బదిలీ అవుతాయి.
ఈ ఏడాది జులైలో 21వ దఫా బాండ్ల అమ్మకాలు జరిగాయి. దాదాపు రూ.389.5కోట్లు వివిధ రాజకీయ పార్టీలకు విరాళాలుగా అందాయి. బాండ్ల పథకంలో ఇప్పటివరకూ విరాళాల మొత్తం రూ.10,246కోట్లకు చేరుకుంది. అక్టోబర్‌లో 22వ దఫా బాండ్ల అమ్మకాలు జరిగాయి. కేంద్ర ఎన్నికల సంఘం నివేదిక ప్రకారం, 2020-21 ఆర్థిక సంవత్సరంలో బడా కార్పొరేట్ సంస్థలు ఇచ్చిన వందల, వేల కోట్ల రూపాయల విరాళాల్లో 75శాతం బీజేపీకి వెళ్లాయి.
పారదర్శకత శూన్యం
జనవరి 2018లో మోడీ సర్కార్ తీసుకొచ్చిన బాండ్ల పథకం అత్యంత వివాదాస్పదమవుతోంది. ఈ పథకం ద్వారా బడా కార్పొరేట్స్ నుంచి వేలకోట్లు బీజేపీ సేకరిస్తోందన్న ఆరోపణులున్నాయి. విరాళాల్లో 95శాతం బీజేపీకి వెళ్లటం...ఆరోపణలకు బలం చేకూర్చుతోంది. ప్రతిఏటా జనవరి, ఏప్రిల్, జులై, అక్టోబర్ నెలల్లో 10రోజులపాటు బాండ్ల అమ్మకాన్ని కేంద్రం చేపడుతోంది. ఈ పథకంలో పారదర్శకత లేదని, తెరవెనుక ప్రయోజనాలు పొందుతున్న బడా కార్పొరేట్ కంపెనీలు, పథకం ద్వారా అధికార పార్టీకి భారీ మొత్తంలో విరాళాలు అందజేస్తున్నాయని వామపక్షాలు, ఎన్జీవో సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఈపథకంలో..విరాళాలు ఇస్తున్న సంస్థ, వ్యక్తులు తమ పేర్లు బయటకు రావు. విరాళాలు ఎక్కడ్నుంచి వచ్చాయన్నది రాజకీయ పార్టీలు చెప్పవు. దీంతో బాండ్ల పథకం అత్యంత వివాదాస్పదంగా మారింది.