Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఈ నెల 11, 12ల్లో రెండు రోజుల పాటు దక్షిణాదిలోని నాలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఈ మేరకు బుధవారం ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) కర్నా టక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ప్రధాని మోడీ పర్యటనకు సంబంధించి షెడ్యూల్‌ను విడుదల చేసింది. నవంబర్ 11న ఉదయం 9:45 గంటలకు బెంగళూరులోని కర్నాటక అసెంబ్లీ (విధాన సౌద్)లో సన్యాసి కవి కనక దాసు, మహర్షి వాల్మీకి విగ్రహాలకు ప్రధాని పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. ఉదయం 10:20 గంటలకు బెంగళూరులోని కెఆర్ఎస్ఆర్ రైల్వే స్టేషన్లో ప్రధాని వందే భారత్ ఎక్స్‌ప్రెస్, భారత్ గౌరవ్ కాశీ దర్శన్ రైలును జెండా ఊపి ప్రారంభిస్తారు. ఉదయం 11:30 గంటలకు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 2ను ప్రధాని మోడీ ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు 108 అడుగుల నాడిపభు కెంపేగౌడ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తరువాత మధ్యాహ్నం 12:30 గంటలకు బెంగళూరులో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3:30 గంటలకు తమిళనాడులోని దిండిగల్‌లో గాంధీగ్రామ్ రూరల్ ఇన్స్టిట్యూట్ 36వ స్నాతకోత్సవ వేడుకలకు ప్రధాని హాజరవుతారు.
తెలుగు రాష్ట్రాల్లో...
నవంబర్ 12న ఉదయం 10:30 గంటలకు ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో బహుళ ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 3:30 గంటలకు తెలంగాణలోని రామగుండంలో ఉన్న ఆర్ఎఫ్సీఎల్ ప్లాంట్‌ను ప్రధాని సందర్శిస్తారు. ఆ తరువాత సాయంత్రం 4:15 గంటలకు రామగుండం వద్ద బహుళ ప్రాజెక్టులకు ప్రధాన మంత్రి ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు.
తెలంగాణలోని రూ.9,500 కోట్ల ప్రాజెక్టులకు...
తెలంగాణలో ప్రధాని మోడీ రూ.9,500 కోట్లపైగా విలువైన బహుళ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. రామగుండంలో ఎరువుల ప్లాంట్‌ను జాతికి అంకితం చేయనున్నారు. రామగుండం ప్లాంట్ ఏడాదికి 12.7 ఎల్ఎంటీ దేశీయ వేప పూతతో కూడిన యూరియా ఉత్పత్తిని అందుబాటులోకి తెస్తుంది. రూ.6,300 కంటే ఎక్కువ పెట్టుబడితో న్యూ అమ్మోనియా-యూరియా ప్లాంట్‌ను ఏర్పాటు చేసే బాధ్యతను ఆర్ఎఫ్సీఎల్కు అప్పగించారు.దాదాపు రూ.1,000 కోట్ల వ్యయంతో నిర్మించిన భద్రాచలం రోడ్డు-సత్తుపల్లి రైలు మార్గాన్ని ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. అలాగే రూ.2,200 కోట్లకు పైగా వ్యయంతో ఎన్‌హెచ్-765డిజి మెదక్-సిద్దిపేట-ఎల్కతుర్తి సెక్షన్, ఎన్‌హెచ్-161బిబి బోధన్-బాసర్-భైంసా విభాగం, ఎన్‌హెచ్-353సి సిరోంచ నుంచి మహదేవ్పూర్ సెక్షన్‌కు సంబంధించిన వివిధ రోడ్డు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. ఏపీలో రూ.3,750 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించనున్న ఆరు లైన్ల గ్రీన్‌ఫీల్డ్ రారుపూర్-విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్‌లో ఏపీ విభాగానికి ఆయన శంకుస్థాపన చేస్తారు. ఇది ఛత్తీస్‌గఢ్, ఒడిశా పారిశ్రామిక వాడల నుంచి విశాఖపట్నం పోర్టు, చెన్నై- కలకత్తా జాతీయ రహదారికి వేగవంతమైన కనెక్టివిటీని అందిస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్, ఒడిశాలోని గిరిజన, వెనుకబడిన ప్రాంతాలకు కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది.