Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మిగతావారికి పౌరసత్వం
- 1414మంది విదేశీయులకు భారత పౌరసత్వం జారీచేసిన కేంద్రం
- 9 రాష్ట్రాల్లో 31 జిల్లాల్లో అమలు
న్యూఢిల్లీ : మోడీ సర్కార్ ముస్లిం మైనార్టీల పట్ల కక్షసాధింపు చర్యల్ని మరింత ముందుకు తీసుకుపోతోంది. విదేశాల నుండి వచ్చిన ముస్లిం మైనార్టీలకు పౌరసత్వం జారీచేసే ఉద్దేశం లేదని మరోమారు వెల్లడించింది. ఏప్రిల్ 2021- డిసెంబర్ 31, 2021 మధ్యకాలంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన హిందు, సిక్కు, బౌద్ధ, జైన, పార్సీ, క్రైస్తవ..మతాలకు చెందిన 1414 మందికి భారత పౌరసత్వం అందజేసినట్టు కేంద్ర హోంశాఖ తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. విదేశీపౌరులైన హిందు, సిక్కు, బౌద్ధ, జైన, పార్సీ, క్రైస్తవ..మతాలకు చెందిన మైనార్టీలకు (ముస్లీంలు తప్ప) భారత పౌరసత్వం జారీచేసే అధికారాన్ని 9 రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శకులకు, ఆ రాష్ట్రాల్లోని 31 జిల్లా కలెక్టర్లకు అధికారాలు ఇచ్చినట్టు నివేదిక పేర్కొన్నది. పౌరసత్వ చట్టం-1955 ప్రకారం 1414మందికి భారత పౌరసత్వం అందజేశామని, గుజరాత్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, హర్యానా, పంజాబ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్రలో చట్టపరమైన అధికారాల్ని ఉపయోగించామని తెలిపింది.
విదేశాల్లోని మైనార్టీలకు భారత పౌరసత్వం జారీచేయటంలో మోడీ సర్కార్ తీసుకొచ్చిన 'సీఏఏ' (పౌరసత్వ సవరణ చట్టం) దేశవ్యాప్తంగా అల్లకల్లోలం రేపింది. కేంద్ర హోంశాఖ తాజా నివేదిక ప్రకారం, 1955నాటి పౌరసత్వ చట్టాన్ని అనుసరించి విదేశీ మైనార్టీలకు పౌరసత్వం జారీచేసింది. సీఏఏను కేంద్రం 2020లో తీసుకొచ్చినా, ఈ చట్టం అమలుకు సంబంధించి నిబంధనల రూపకల్పన పూర్తిచేయలేదు. అయినప్పటికీ 1955 పౌరసత్వ చట్టాన్ని ప్రస్తావిస్తూ సీఏఏను అమల్లో పెడుతోంది. తాజాగా మరో రెండు రాష్ట్రాల్లోని 13 జిల్లాల కలెక్టర్లకు పౌరసత్వం జారీచేసే అధికారాల్ని కల్పించింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన హిందు, సిక్కు, బౌద్ధ, జైన, పార్సీ, క్రైస్తవ..మతాలకు చెందిన వారికి మాత్రమే పౌరసత్వం అందజేయాలని జిల్లా కలెక్టర్లు, రాష్ట్ర హోంశాఖ కార్యదర్శులకు ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొన్నది. ఇందుకు సంబంధించి కేంద్రం విడుదల చేసిన జిల్లాల జాబితాలో గుజరాత్‌లోని ఆనంద్, మెహసానా జిల్లాలున్నాయి.