Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తీస్తా సెతల్వాద్, కప్పన్‌కు బెయిల్
- ఆరు రాజ్యాంగ ధర్మాసనాలు
- చివరిలో కొలీజియం వ్యవహారంపై వివాదం
- ప్రొఫెసర్ సాయిబాబా అంశంపై విమర్శలు
- 74 రోజుల పదవీకాలంలో జస్టిస్ యుయు లలిత్
న్యూఢిల్లీ : సీనియారిటీతో సంబంధం లేకుండా తన కోర్టులో హాజరైన ప్రతి న్యాయవాదిని సర్, మేడమ్ అని సంబోధించి.. అత్యంత వినయపూర్వకమైన, ఓర్పుగల సీజేఐల్లో ఒకరైన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు లలిత్ మంగళవారం 74 రోజుల స్వల్ప పదవీకాలం తరువాత పదవి నుంచి వైదొలిగారు. 2022 ఆగస్టు 27న 49వ సీజేఐగా నియమితులైన ఆయన సుప్రీం కోర్టు బార్ నుంచి ధర్మాసనానికి పదోన్నతి పొందిన రెండో సీజేఐగా, ఆరో న్యాయమూర్తిగా నిలిచారు. దేశంలోని అత్యున్నత న్యాయస్థానం, న్యాయవాదులు, పాత్రికేయులు, సామాన్య ప్రజలతో పాటు, ఆయన నాయకత్వంలో అనేక ''చారిత్రాత్మక, అపూర్వమైన కదలికలను'' చూసింది.
10 వేలకు పైగా కేసులను పరిష్కరించడంతో సుప్రీం కోర్టు విజయం సాధించింది. పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించే ఉద్దేశంతో అనేక సంవత్సరాలుగా అనేక లోపాలలో పడి ఉన్న 13,000 కేసులను కూడా అత్యున్నత న్యాయస్థానం పరిష్కరించింది. ఆయన నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం చివరి రోజున ఆర్థికంగా బలహీన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) ఇచ్చిన 10 శాతం కోటా చెల్లుబాటును 3:2 మెజారిటీతో సమర్థించింది. కానీ, సీజేఐ లలిత్ మైనారిటీ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సవరణ ''సమానత్వ నియమావళిని'' నాశనం చేస్తున్నట్లుగా పేర్కొన్నారు.
సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సీజేఐగా ఆయన నేతృత్వంలోని ధర్మాసనం, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌పై ఈడీ దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్లను స్వీకరించాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పక్కనపెట్టింది. 'హత్రాస్ కుట్ర' కేసులో కేరళ జర్నలిస్ట్ సిద్ధిఖీ కప్పన్‌కు బెయిల్ మంజూరు చేసింది. 2012లో ఢిల్లీలోని చావ్లాలో 19 ఏండ్ల యువతిపై సామూహిక లైంగికదాడి, హత్య కేసులో మరణశిక్ష విధించిన ముగ్గురు వ్యక్తులను సీజేఐ లలిత్ ధర్మాసనం నిర్దోషులుగా ప్రకటించింది.
ట్రిపుల్ తలాక్ విధానాన్ని రాజ్యాంగ విరుద్ధమని తీర్పునిచ్చిన ధర్మాసనంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆయన సభ్యుడిగా ఉన్నారు. 2018 భీమా కోరేగావ్ కేసులో న్యాయవాది కార్యకర్త సుధా భరద్వాజ్‌కు ముంబాయి హైకోర్టు ఇచ్చిన డిఫాల్ట్ బెయిల్‌ను సవాలు చేస్తూ ఎన్ఐఎ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ లలిత్ ధర్మాసనం తోసిపుచ్చింది. జస్టిస్ యుయు లలిత్ 74 రోజుల స్వల్ప వ్యవధిలో ఆరో రాజ్యాంగ ధర్మాసనాలను ఏర్పాటు చేశారు. గతంలో ఎన్నడూ జరగని విధంగా ఒకే రోజు రెండు రాజ్యాంగ ధర్మాసనాలు పని చేశాయి. ఈ కాలంలో పెద్ద నోట్ల రద్దు, ఈడబ్ల్యూఎస్ కోటా, సీఏఏ, ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన రాజకీయంగా సున్నితమైన సమస్యలతో సహా అనేక కేసులు జాబితా చేయబడ్డాయి. జస్టిస్ యుయు లలిత్ పదవీకాలంలో హైకోర్టుల న్యాయమూర్తులుగా పలువురి పేర్లను సిఫారసు చేస్తూ సుప్రీం కోర్టు కొలీజియం తొమ్మిది తీర్మానాలను ఆమోదించింది. ముంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపాంకర్ దత్తాను సుప్రీంకోర్టుకు పదోన్నతి ప్రతిపాదన కూడా చేసింది. పరిశీలించిన కొన్ని పేర్లను త్వరగా ఖరారు చేసేందుకు సీజేఐగా లలిత్ చేసిన ప్రయత్నం వివాదానికి దారి తీసింది. ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా, ఇతరుల విడుదలకు వ్యతిరేకంగా మహారాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ అత్యవసరంగా లిస్టింగ్‌ను అనుమతించిన సీజేఐ లలిత్ విమర్శలకు గురయ్యారు.