Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాధారణంగా వాయిదా వేయం
- ఈ ఏడాది లోపే పూర్తి చేయాలి
- నోట్ల రద్దుపై రాజ్యాంగ ధర్మాసనం
- నవంబర్ 24కి విచారణ వాయిదా
న్యూఢిల్లీ:నోట్ల రద్దుపై అఫిడవిట్ దాఖలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం మరింత సమయం కోరడంపై సుప్రీం కోర్టు ధర్మాసనం ఒకింత అసంతృప్తి వ్యక్తం చేసింది. ''ఇది కోర్టుకు ఇబ్బందికరం'' అని పేర్కొంటూ విచారణను నవంబర్ 24కి వాయిదా వేసింది. 2016 నవంబర్ 8న కేంద్ర ప్రభుత్వం చేసిన రూ. 500, రూ.1,000 నోట్లను రద్దును సవాల్ చేస్తూ దాఖలైన 58 పిటిషన్లను బుధవారం సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ఎస్. అబ్దుల్ నజీర్, జస్టిస్ బిఆర్ గవారు, జస్టిస్ ఎఎస్ బోపన్న, జస్టిస్ వి. రామసుబ్రమణియన్, జస్టిస్ బివి నాగరత్నలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారించింది. విచారణను వాయిదా వేయాలన్న కేంద్ర ప్రభుత్వ అభ్యర్థనను ధర్మాసనం అంగీకరించింది. గత నెలలో జరిగిన విచారణ సమయంలో ప్రభుత్వం తన అదనపు ప్రత్యుత్తరాలను దాఖలు చేసి, బుధవారం వాదనలు వినిపించాలని ధర్మాసనం ఆదేశించింది. అయితే, బుధవారం అటార్నీ జనరల్ (ఏజీ) ఆర్ వెంకటరమణి ప్రతిస్పందన దాఖలు చేయడానికి మరో వారం గడువు కోరారు. దీనిపై జోక్యం చేసుకున్న జస్టిస్ నాగరత్న ''సాధారణంగా రాజ్యాంగ ధర్మాసనం ఇలా వాయిదా వేయం. మేం ఎప్పుడూ ఇలా చేయం. ఇది కోర్టుకు కూడా చాలా ఇబ్బందికరం'' అని వ్యాఖ్యానించారు. అనంతరం ధర్మాసనం ఏజీ అభ్యర్థనను అనుమతించి, కేసును తదుపరి విచారణకు నవంబర్ 24న జాబితా చేయగా, ఈ ఏడాదిలోపు విచారణను పూర్తి చేయాలని నొక్కి చెప్పింది.
వాయిదా కోరడం తనకు కూడా ఇబ్బందిగా ఉందనీ, అయితే సాధ్యమైనంత నిర్మాణాత్మకంగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తానని ఎజి కోర్టుకు హామీ ఇచ్చారు. కేంద్రం సమాధానం ఇవ్వలేనప్పటికీ, పిటిషనర్ల విచారణను కొనసాగించాలని పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ ధర్మాసనాన్ని కోరారు. ''నాకు తెలిసినంత వరకు రాజ్యాంగ ధర్మాసనం కూర్చున్నప్పుడు.. వాయిదా వేయమని అడగడం సాంప్రదాయం కాదు. ఇలాంటి అభ్యర్థన చాలా అసాధారణమైనది. వారికి అవసరమైతే నేను సూచిస్తాను. మా వాదనలు పూర్తి చేద్దాం. సమస్య లేదు'' అని అన్నారు.
అయితే, ఈ వ్యాజ్యాన్ని న్యాయస్థానం తన మెరిట్‌పై విచారించడానికి ప్రతి స్పందనను దాఖలు చేయడం తప్పనిసరి అని ఏజీ పట్టుబట్టడంతో ధర్మాసనం అభ్యర్థనను అనుమతించింది. గత విచారణలో నోట్ల రద్దుతో ఉత్పన్నం అయిన సమస్యలు ఇంకా సజీవంగా ఉన్నాయని, నోట్ల రద్దు చర్య రాజ్యాంగ చెల్లుబాటుపై కోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పిటిషనర్ల నొక్కి చెప్పారు. 18 ఏండ్ల తరువాత 1996లో 1978లో డీమోనిటైజేషన్ అమలుకు సంబంధించి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీసుకున్న నిర్ణయాన్ని సీనియర్ న్యాయవాది దివాన్ ప్రస్తావించారు. కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ న్యాయవాది పి. చిదంబరం కూడా నోట్ల రద్దు ప్రక్రియను సవాలు చేసేందుకు పిటిషనర్లు తీసుకోవాల్సిన విస్తృత కారణాలను ధర్మాసనం ముందు ఉంచారు.