Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్డినెన్స్ తీసుకొస్తున్న ఎల్డీఎఫ్ ప్రభుత్వం
- ఛాన్స్లర్ స్థానంలో విద్యా నిపుణుడిని నియమించేందుకు కార్యాచరణ
తిరువనంతపురం : కేరళలో గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ తీరు అత్యంత వివాదాస్పదంగా మారటంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేరళలో వర్సిటీల ఛాన్స్‌లర్‌గా గవర్నర్‌ను తొలగిస్తూ నిర్ణయం వెలువరిం చింది. గవర్నర్ స్థానంలో ఓ విద్యారంగ నిపుణుడ్ని నియమించేందుకు పినరరు విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం కార్యాచరణ చేపడుతోంది. దీనిపై త్వరలోనే ఆర్డినెన్స్ తీసుకురానున్నట్టు కేరళ ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్.బిందు తెలిపారు. బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై న్యాయశాఖ తయారుచేసిన ముసాయిదా ఆర్డినెన్స్‌పై కేబినెట్ సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలోని 14 వర్సిటీలకు గవర్నర్ సారథ్యం వహించాలనే సెక్షన్‌ను తొలగించి, ఛాన్స్లర్ నియామకానికి సంబంధించి యూనివర్సిటీ చట్టాలను సవరించే ఆర్డినెన్స్‌ను తీసుకొస్తున్నట్టు ఎల్డీఎఫ్ ప్రభుత్వం పేర్కొన్నది. భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి మదన్ మోహన్ పుంఛీ నేతృత్వంలోని కమిషన్ సిఫార్సులను కేబినెట్ పరిగణలోకి తీసుకుంది. వర్సిటీల ఛాన్స్‌లర్‌గా గవర్నర్‌ను నియమించటం సరికాదని పుంఛీ కమిషన్ అభిప్రాయపడింది. ప్యానెల్ సిఫార్సులు, ఉన్నత విద్యకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని ప్రముఖ విద్యావేత్తను వర్సిటీల ఛాన్స్‌లర్‌గా నియమించాలని భావిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఉన్నత విద్యా కేంద్రాలను అంతర్జాతీయ ప్రమాణాలకు చేర్చేందుకు నైపుణ్యం కలిగిన వ్యక్తులకు వర్సిటీల సారథ్యం అప్పగించాలని మంత్రివర్గం అభిప్రాయపడింది.
అయితే ఈ ఆర్డినెన్స్‌పై రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ సంతకం చేస్తేనే అమల్లోకి వస్తుంది. దీంతో ఆయన సంతకం చేస్తారా? లేదా? అన్నదానిపై విద్యాశాఖ మంత్రిని మీడియా ప్రశ్నించగా, గవర్నర్ తన రాజ్యాంగ బాధ్యతలకు అనుగుణంగా వ్యవహరిస్తారని ఆశిస్తున్నట్టు మంత్రి ఆర్.బిందు తెలిపారు. విశ్వవిద్యాలయాల్లో వైస్ ఛాన్స్లర్ల నియామకాల విషయంలో పినరరు విజయన్ ప్రభుత్వం, గవర్నర్‌కు మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. కేరళలోని 9 యూనివర్సిటీల ఉప కులపతులు (వీసీలు) తక్షణమే రాజీనామా చేయాలని ఇటీవల గవర్నర్ ఉత్తర్వులు జారీచేశారు. దానికి వీసీల నుంచి స్పందన రాకపోవడంతో షోకాజ్ నోటీసులు సంధించారు. గవర్నర్ వైఖరిని సీఎం విజయన్ తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగ పెద్దలు తమ హద్దులు దాటకూడదని పేర్కొన్నారు. వీసీల రాజీనామా వ్యవహారంపై ప్రస్తుతం కేరళ హైకోర్టులో విచారణ పెండింగ్‌లో ఉంది.