Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పిటిషన్‌ను వ్యతిరేకించిన కేంద్రం
- వారు ఓబీసీ రిజర్వేషన్లు, ప్రయోజనాలు పొందవచ్చు: సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు
న్యూఢిల్లీ : క్రైస్తవ, ఇస్లాం మతంలోకి మారిన దళితులకు షెడ్యూల్డ్ కులాల ప్రయోజనాలు కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. ''వందల సంవత్సరాల నుంచి హిందూ సమాజంలో ఉన్న అణచివేత వాతావరణం క్రైస్తవ, ఇస్లామిక్ సమాజంలో కూడా ఉన్నదని సూచించడానికి ప్రామాణికమైన డేటా లేదు. అందువల్ల షెడ్యూల్డ్ కులాలకు అర్హులైన ప్రయోజనాలను ఇవ్వలేం'' అని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇస్లాం, క్రైస్తవ మతంలోకి మారిన దళిత వర్గాల ప్రజలకు రిజర్వేషన్లు, ఇతర ప్రయోజనాలను పొడిగించాలనీ, జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ నివేదికలో ఇతర మతాల్లోని దళితులు కూడా దళిత హిందువుల మాదిరిగానే అనేక బాధపడుతున్నారని పేర్కొంటూ పిటిషన్ దాఖలు అయింది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల కమిషన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందని పేర్కొంది. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎస్కె కౌల్, జస్టిస్ అభరు ఎస్ ఓకా , జస్టిస్ విక్రమ్ నాథ్‌లతో కూడిన ధర్మాసనం పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వ స్పందన కోరతూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం హిందూ, బౌద్ధ, సిక్కు మతాలకు చెందిన వర్గాలకు మాత్రమే షెడ్యూల్డ్ కుల హౌదాను కల్పించే 1950 నాటి రాజ్యాంగ (షెడ్యూల్డ్ కులాలు) ఉత్తర్వు రాజ్యాంగ విరుద్ధం కాదని స్పష్టం చేసింది. అందులో క్రైస్తవ, ఇస్లాం మతాలను మినహాయించిందనీ, కనుక ఎటువంటి రాజ్యాంగ ఉల్లంఘన లేదని పేర్కొంది. ఎందుకంటే కొన్ని హిందూ కులాల ఆర్థిక, సామాజిక వెనుకబాటుకు దారితీసే అంటరానితనం వ్యవస్థ క్రైస్తవులు, ముస్లీంల్లో ప్రబలంగా లేదని తెలిపింది. క్రైస్తవులు, ముస్లింలు 27 శాతం ఒబిసి రిజర్వేషన్లకు మాత్రమే కాకుండా, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్, హాస్టల్స్, జాతీయ వెనుకబడిన తరగతుల ఫైనాన్స్ అండ్ డవలప్మెంట్ కార్పొరేషన్ చేపట్టే ఇతర ఆదాయ కార్యకలాపాల ప్రయోజనాలను కూడా పొందవచ్చని సూచించింది. మైనారిటీల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాల ప్రయోజనాలకు షెడ్యూల్డ్ కులాలు క్రైస్తవులు, ఇస్లాంలోకి మారిన వారు కూడా అర్హులని పేర్కొంది. దళిత ముస్లింలు, దళిత క్రిస్టియన్లను షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ)లుగా చేర్చడాన్ని పరిగణనలోకి తీసుకునేందుకు ముగ్గురు సభ్యుల కమిషన్‌ను నియమించామనీ, దళిత ముస్లింలు, క్రైస్తవులపై అధ్యయనం చేయనున్నందున పిటిషనర్లు కమిషన్ నివేదిక కోసం వేచి ఉండాలని కూడా కేంద్రం స్పష్టం చేసింది.