Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడు రోజుల పాటు ఈడీ కస్టడీ
- విధించిన సీబీఐ ప్రత్యేక కోర్టు
- వంద కోట్లు ముడుపుల వ్యవహారం
న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో అరబిందో డైరెక్టర్ పెనక శరత్ చంద్రారెడ్డి, పెర్నోడ్ రికార్డ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ జనరల్ మేనేజర్ బినరుబాబును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. వారిని గురువారం మధ్యాహ్నం 2:30 గంటలకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో వారిని హాజరు పర్చారు. దాదాపు గంటన్నర పాటు విచారణ జరిగిన తరువాత వీరిద్దరిని ఏడు రోజుల పాటు ఈడీ కస్టడీకి అనుమతిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఎంకె నాగపాల్ ఉత్వర్వులు జారీ చేశారు. ఈ ఏడు రోజుల్లో ప్రతి రోజూ గంట (సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య) పాటు శరత్ చంద్రారెడ్డిని ఆయన భార్య, బినరు బాబును ఆయన కుటుంబ సభ్యులల్లో ఒకరు కలుసుకునేందుకు అవకాశం ఇచ్చింది. అలాగే సీసీటీవీల పర్యవేక్షణలో విచారణ చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ నవంబర్ 17కు వాయిదా వేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో శరత్‌చంద్రారెడ్డిని కీలక సూత్రధారిగా పేర్కొంటూ సీబీఐ కోర్టుకు ఈడీ రిమాండ్ రిపోర్టు అందజేసింది. ట్రైడెంట్ సహా గ్రూపు కంపెనీలు కలిసి.. 2 కంటే ఎక్కువ రిటైల్ జోన్స్ కంట్రోల్ చేస్తున్నాయని ఈడీ తెలిపింది. ఢిల్లీ లిక్కర్ మార్కెట్లో 30శాతం తన గుప్పెట్లో పెట్టుకున్నారనీ, బినామీ కంపెనీలతో నిబంధనలకు విరుద్ధంగా తొమ్మిది రిటైల్ జోన్స్‌ని శరత్ చంద్రా రెడ్డి పొందారని ఈడీ పేర్కొంది. శరత్ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో సౌత్ గ్రూప్ ఏర్పాటు చేశారని ఈడీ స్పష్టం చేసింది. సౌత్ గ్రూప్‌తో రూ.100 కోట్లు, వినరు నాయర్‌తో రూ.100 కోట్ల ముడుపులు చెల్లించారనీ, శరత్ చంద్రారెడ్డికి చెందిన 3 కంపెనీలతో ఇప్పటివరకు రూ.64.35 కోట్లు అక్రమంగా సంపాదించారని ఈడీ తెలిపింది. రూ.60 కోట్లు ఇండో స్పిరిట్స్ కంపెనీకి తరలించారని ఈడీ వెల్లడించింది.