Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతుల పంట వ్యర్థాలు కాల్చడం నిషేధంపై అత్యవసర విచారణకు సుప్రీం కోర్టు నిరాకరణ
న్యూఢిల్లీ : ఇతర ఉత్తర భారత రాష్ట్రాలల్లో వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి రైతుల పంట వ్యర్థాలను (పొట్టును తగలబెట్టడాన్ని) కాల్చడాన్ని పూర్తిగా నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను అత్యవసర విచారణకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. న్యాయవాది శశాంక్ శేఖర్ ఝా దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ జెబి పార్దీవాలాతో కూడిన ధర్మాసనం విచారించింది. ఇవి కచ్చితంగా న్యాయవ్యవస్థ పరిధిలోకి వచ్చే అంశాలు కాదని సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ అన్నారు. ఢిల్లీ కాలుష్యానికి మీ పరిష్కారం ఏమిటీ? అని పిటిషనర్‌ను సీజేఐ ప్రశ్నించారు. అందుకు న్యాయవాది శశాంక్ శేఖర్ ఝా స్పందిస్తూ ఢిల్లీని చుట్టుముట్టిన కాలుష్య సమస్యను పరిష్కరించడంలో రైతులు వ్యర్థాలు కాల్చడాన్ని నిషేధించడం ప్రధానమైనదని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సీజేఐ ''మేం దానిని నిషేధించి నప్పటికీ, అది ఆగిపోతుందని మీరు అనుకుంటున్నారా? పంజాబ్, యూపీలోని ప్రతి ఒక్క రైతుపై మేం దానిని అమలు చేయాలా?'' అని వ్యాఖ్యానించారు. అందువల్ల, ఈ అంశాన్ని ప్రాధాన్యతగా జాబితా చేయడానికి నిరాకరించారు. ''మేము మీ వాదన విన్నాం. కానీ దీన్ని ఇప్పుడు విచారణకు తీసుకోం'' అని అన్నారు. కాలుష్యంపై పోరాడేందుకు కొన్ని వాస్తవ పరిష్కారాలను అమలు చేయాల్సిన అవసరం ఉన్నదని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. ఇది సరైన మార్గం కాదనీ, నిజమైన పరిష్కారాలను కనుగొనాలని సూచించారు. ''కోర్టులు చేయగల కొన్ని విషయాలు ఉన్నాయి. కొన్నివిషయాలను కోర్టులు చేయలేవు. మేము న్యాయపరంగా అనుకూలమైన విషయాలను నిర్వహిస్తాం. కనుక ఈ పిటిషన్‌ను వెంటనే విచారించలేం'' అని పేర్కొన్నారు. ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని నియంత్రించడంలో కోర్టు తక్షణ జోక్యం చేసుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు గత వారం అంగీకరించింది. ''ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది'' అని అప్పటి సీజేఐ జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. అలాగే నవంబర్ 10 (గురువారం) ఈ అంశాన్ని జాబితా చేయడానికి కోర్టు అంగీకరిం చింది. పిటిషన్‌ను గురువారం విచారించిన సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం అత్యవసర విచారణకు తిరస్కరించింది.