Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నెల రోజుల పాటు ఇంట్లోనే ఉండేందుకు అనుమతి
- పలు షరతులు విధింపు.. సుప్రీం కోర్టు ఆదేశాలు
న్యూఢిల్లీ : భీమా కోరెగావ్ నిందితుడు గౌతమ్ నవ్లాఖాను నెల రోజుల పాటు జైలు నుంచి గృహ నిర్బంధానికి తరలించాలని దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు గురువారం అనుమతించింది. కొన్ని షరతులను విధించింది. నవ్లాఖా గృహ నిర్బంధంలో ఉన్నప్పుడు అతని భద్రత కోసం ఖర్చుల కింద రూ.2.4 లక్షలు డిపాజిట్ చేయాలని న్యాయమూర్తులు కెఎమ్ జోసెఫ్, హృషికేష్ రారులతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ''2020 నుంచి అతను కస్టడీలో ఉన్నారు. అంతకు ముందు అతను గృహ నిర్భంధంలో ఉన్నారు. అప్పుడు ఆయన దుర్వినియోగం చేసినట్టు ఫిర్యాదు లేదు. అతనిపై ఈ కేసు మినహా ఎటువంటి నేరపూరిత పూర్వాపరాలు లేవు. అతను నెల రోజుల పాటు గృహనిర్బంధంలో ఉంచడానికి అనుమతించాలని మేం భావిస్తున్నాం. గృహనిర్బంధాన్ని దుర్వినియోగం చేయకుండా పర్యవేక్షించడానికి సాయుధ ఎస్కార్ట్‌లు ఉంటాయి'' అని ధర్మాసనం పేర్కొంది. ''అయితే నవ్లాఖా గృహ నిర్బంధాన్ని దుర్వినియోగం చేయకుండా చూసేందుకు అవసరమైతే ఆ నివాసాన్ని సోదాలు, తనిఖీ చేయడానికి పోలీసులు అనుమతి ఉంటుంది. అటువంటి సోదాలు, తనిఖీలను పోలీసులు దుర్వినియోగం చేయకూడదు. పిటిషనర్‌ను వేధించే ఎత్తుగడగా ఉండకూడదు'' అని స్పష్టం చేసింది.గృహ నిర్బంధంలో ఉన్నప్పుడు నవ్లాఖా కంప్యూటర్, ఇంటర్నెట్, మరే ఇతర కమ్యూనికేషన్ పరికరాన్ని ఉపయోగించకూడదని ధర్మాసనం పేర్కొంది. ''అయితే డ్యూటీలో ఉన్న పోలీసు సిబ్బంది అందించిన మొబైల్ ఫోన్‌ను రోజుకు ఒకసారి 10 నిమిషాల పాటు పోలీసుల సమక్షంలో ఉపయోగిం చొచ్చు'' అని కోర్టు ఆదేశించింది. అయితే, టెలివిజన్, వార్తాపత్రికలు ఇంటర్నెట్ ఆధారితవి కానట్లయితే ఇంట్లోకి అనుమతించబడతాయని పేర్కొంది. ''పిటిషనర్ ముంబయి విడిచి వెళ్లడానికి లేదు. పిటిషనర్ కుటుంబ సభ్యులను ప్రతిరోజూ మూడు గంటల పాటు కలిసేందుకు అనుమతించాలి'' అని కోర్టు ఆదేశించింది. ప్రవేశ ద్వారం వద్ద, నివాస గదుల వెలుపల సీసీటీవీలు ఉంచాలనీ, ఏ సమయంలోనూ వాటిని ఆఫ్ చేయకూడదని ధర్మాసనం ఆదేశాల్లో పేర్కొంది.