Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ పర్యటన నేపథ్యంలో విరుచుకుపడిన ఏపీ ప్రభుత్వం
- కార్మికుల అరెస్ట్.. రాష్ట్రవ్యాప్త నిరసనలు
విశాఖ: స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ఉక్కు కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం విరుచుకుపడింది. గతంలో ఈ పోరాటానికి మద్దతు తెలిపి, రాష్ట్ర అసెంబ్లీలోనూ తీర్మానం చేసిన ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్రమోడీ పర్యటన నేపధ్యంలో శుక్రవారం ఉక్కు దీక్షా శిబిరంపై పోలీసు బలగాలను ప్రయోగించింది. పైనుండి ఆందిన ఆదేశాలతో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన కూర్మన్నపాలెం జంక్షన్లో 638 రోజులుగా జరుగుతున్న దీక్షా శిబిరంపై ప్రధాని పర్యటనకు కొన్ని గంటల ముందు పోలీసులు దాడి చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ఒక్కసారిగా జరిగిన ఈ దాడితో శిబిరం వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆంధ్రుల హక్కు..విశాఖ ఉక్కు నినాదాలు మారుమ్రోగాయి. కార్మికులను, నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు 20 కి.మీ దూరంలోని సబ్బవరం, పెందుర్తి పోలీసు స్టేషన్లకు తరలించారు. అంతకుముందు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, విభజన హామీల అమలు, రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరిగాయి. విశాఖ పర్యటనలోనే ప్రధాని వీటిపై ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ నిరసనల్లో భాగస్వాములయ్యారు.
మరోవైపు కార్మికులు, వారి కుటుంబసభ్యులు, స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు నల్లబ్యాడ్జీలతో శుక్రవారం ఉదయమే దీక్షా శిబిరానికి చేరుకున్నారు. వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను అమ్మబోమని ఈ నెల 12న జరిగే బహిరంగ సభలో ప్రధాని స్పష్టమైన ప్రకటన చేయాలంటూ నినాదాలు చేశారు. ప్రశాంతంగా సాగుతున్న శిబిరం వద్దకు వచ్చిన పోలీసులు దీక్షా శిబిరాన్ని వెంటనే ఖాళీ చేయాలని, లేకుంటే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. అయినా, కార్మికులు బెదరకుండా దీక్షా శిబిరంలోనే ఉన్నారు. దీంతో, పోలీసులు రెచ్చిపోయారు. దొరికిన వారిని దొరికినట్టు ఈడ్చికెళ్లి అరెస్టు చేసి వ్యాన్లలో ఎక్కించి పోలీస్ స్టేషన్లకు తరలించారు. దీక్షలకు వైసిపి ప్రభుత్వం మద్దతు ఇస్తోన్నా తమను ఎందుకు అరెస్టు చేస్తున్నారో సమాధానం చెప్పాలని కార్మికులు ప్రశ్నించారు. 'సేవ్ వైజాగ్ స్టీల్' అంటూ నినాదాలను హోరెత్తించారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్ జె.అయోధ్యరామ్, చైర్మన్లు డి.ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్ తదితరులతోపాటు ఆరుగురు మహిళలు ఉన్నారు. అరెస్టుల అనంతరం దీక్షా శిబిరం చుట్టూ పోలీసు పహరా కొనసాగించారు. స్టీల్‌ప్లాంట్ కార్మిక సంఘాల కార్యాలయాలపై పోలీసులు గట్టి నిఘా పెట్టారు. నాయకుల కదలికలను ప్రతిక్షణం పరిశీలిస్తున్నారు.
అరెస్టులకు ముందు దీక్షా శిబిరంలో పాల్గొన్న వారిని ఉద్దేశించి జివిఎంసి కార్పొరేటర్ డాక్టర్ బి.గంగారావు మాట్లాడారు. కేంద్రంలోని బిజెపి దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయన్నారు స్టీల్‌ప్లాంట్‌ను అమ్మకానికి పెట్టిన కేంద్ర ప్రభుత్వానికి వత్తాసు పలుకేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుండడం శోచనీయమన్నారు. ఉక్కు కార్మికుల పోరాటానికి పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ కదిలొచ్చి మద్దతు తెలిపి కేంద్రాన్ని నిలదీయాలని కోరారు. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి.సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ లక్షల కోట్ల రూపాయల విలువైన స్టీల్ ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కార్మికుల మనోభావాలను అర్థం చేసుకోవాలని కోరారు. జె.అయోధ్యరామ్ మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్ కార్మికులు శాంతియుతంగా పోరాటం చేస్తుంటే, పోలీసులు నిర్బంధం ప్రయోగించడం దారుణమన్నారు. టిడిపి మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వ తీరును ఖండించారు. గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను టిడిపి తొలి నుంచీ వ్యతిరేకిస్తోందన్నారు.
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అరెస్టు, పలువురు గృహనిర్బంధం
సీపీఐ(ఎం) విశాఖ జిల్లా కార్యదర్శి, విశాఖ అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల జెఎసి చైర్మన్ ఎం.జగ్గునాయుడును పోలీసులు శ్రీనగర్ వద్ద అడ్డుకుని భీమిలి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. మల్కాపురం జోన్లో పలువురు నాయకులను గృహ నిర్బంధం చేశారు.