Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లేఆఫ్‌లతో బెంబేలెత్తిస్తున్న టెక్ కంపెనీలు
- మొన్న ట్విట్టర్..నిన్న ఫేస్బుక్..నేడు అమెజాన్
- ఆర్థికమాంద్యంలోకి ప్రపంచం..!
- సంకేతాలున్నందునే...ఉద్యోగాల కోతకు తెరలేపిన మల్టీనేషనల్ కంపెనీలు
న్యూఢిల్లీ : ఫ్లిప్‌కార్ట్, అడోబ్ వంటి ప్రఖ్యాత కంపెనీల్లో పనిచేసిన భారతీయ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఒకరు హఠాత్తుగా నిరుద్యోగిగా మారాడు. ఫేస్బుక్లో ఉద్యోగం వచ్చిందని కెనడాకు వెళ్లి జాయిన్ అయిన రెండో రోజే ఉద్యోగం పోయింది. ''ఇప్పుడేం చేయాలో అర్థం కావటం లేదు. ఎక్కడైనా ఉద్యోగం ఉంటే చెప్పండి..అంటూ లింక్డ్ఇన్''లో ఫాలోవర్స్‌ను కోరాడు. ఐఐటీ, ఖరగ్‌పూర్‌లో చదువుకున్న వ్యక్తి పరిస్థితే ఇలా ఉంటే..మామూలు టెక్ ఉద్యోగుల ఆందోళన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అమెజాన్‌లోని రోబోటిక్స్‌లో మొత్తం సిబ్బంది (4వేలమంది ఉంటారు) తొలగించారని సోషల్ మీడియాలో పలువురు సందేశాలు పంపారు. లాభాలే పరమావధిగా యాపిల్, ట్విట్టర్, ఫేస్బుక్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్..తదితర కంపెనీలు లేఆఫ్‌లు ప్రకటిస్తున్నాయి. వేలాదిమంది సాఫ్ట్వేర్ ఉద్యోగుల్ని రోడ్డున పడేస్తున్నాయి. హైదరాబాద్, చెన్నై, బెంగుళూర్, ముంబయి, పూణెలలో పనిచేస్తున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన సాఫ్ట్వేర్ నిపుణులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వ్యక్తిగత ఈ-మెయిల్‌కు కంపెనీ నుంచి 'తొలగింపు' మెయిల్ ఎప్పుడు వస్తుందో తెలియని అనిశ్చితి వారిని వెంటాడుతోంది. ట్విట్టర్ సిబ్బందిలో సగానికిపైగా తొలగిస్తున్నామని ఎలాన్ మస్క్ ప్రకటించారు. భారత్, అమెరికా, కెనడా సహా ప్రపంచ వ్యాప్తంగా పనిచేస్తున్న ఫేస్బుక్ ఉద్యోగుల్లో 11వేల మందిని విధుల నుంచి తప్పిస్తున్నామని జుకర్‌బర్గ్ బాంబు పేల్చాడు. ఒక్కసారిగా కాకుండా..దశలవారీగా స్నాప్‌చాట్ ఉద్యోగుల్ని తొలగిస్తోంది. తాజాగా మరో 20శాతం మందిని ఇంటికి పంపింది. సడీచప్పుడు లేకుండా మైక్రోసాఫ్ట్‌లో వెయ్యిమంది ఉద్యోగుల్ని తొలగించారు. వేలాదిమందిని తొలగించేందుకు 'ఇంటెల్' ప్రణాళికలు సిద్ధం చేసింది. తీవ్రమైన ఆర్థికమాంద్యం తలెత్తవచ్చుననే సంకేతాలు ఉన్నందునే టెక్ కంపెనీలు లేఆఫ్‌లు ప్రకటిస్తున్నాయని సమాచారం.
అద్భుతమైన ప్రతిభ ఉన్నా..
ఇంటెల్‌లో 20శాతం మంది సిబ్బందిని తొలగించే అవకాశముందని వార్తలు వెలువడ్డాయి. అమెజాన్, యాపిల్ కంపెనీలు కూడా లేఆఫ్‌లు ప్రకటించాయి. కొత్త నియామకాలను నిలిపివేశాయి. అద్భుతమైన ప్రతిభ కలిగిన టీం లీడర్లు, ఇంజనీర్లను సైతం కంపెనీలు నిర్దాక్షణ్యంగా తొలగిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం..అమెరికా, యూరప్ దేశాల్లో ఆర్థిక అనిశ్చితి మరింత బలపడటమే. తమ ఉత్పత్తులు, సర్వీస్ ప్రాజెక్టులు మునుముందు కొనసాగవని కంపెనీలు ఒక నిర్ధారణకు వచ్చాయి. దాంతో జీతాల వ్యయాన్ని తగ్గించుకోవాలని, తద్వారా లాభాల మార్జిన్ పెంచుకోవాలని చూస్తున్నాయి.
పెనుసమస్యగా మారిన ద్రవ్యోల్బణం
ద్రవ్యోల్బణం ప్రపంచ దేశాల్ని వణికిస్తోంది. అధిక ధరలతో అల్లాడుతున్న సామాన్యుడి కుటుంబాన్నేగాక, మల్టీనేషనల్ కంపెనీల వాణిజ్యంపైనా ప్రభావం చూపింది. అమెరికా కేంద్ర బ్యాంక్ 'ఫెడరల్ రిజర్వ్' ఎన్ని చర్యలు చేపట్టినా అక్కడ ద్రవ్యోల్బణం కట్టడి కావటం లేదు. యూరప్‌లో బ్రిటన్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. నగదు చెల్లింపులకు సంబంధించి సాఫ్ట్వేర్ సేవల్ని అందించే 'స్ట్రిప్' (ఐరిష్-అమెరికా) కంపెనీ సీఈవో ప్యాట్రిక్ కొల్లిన్స్ ఇదే విషయం ప్రస్తావించారు. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం, ఇంధన వనరులు, వడ్డీ రెట్ల పెంపు...ఇవన్నీ టెక్ సంస్థల పెట్టుబడులను ప్రభావితం చేసిందన్నారు. ముందు ముందు నిధుల సేకరణ అత్యంత దుర్లభం కానున్నదని కొల్లిన్స్ చెప్పుకొచ్చారు.