Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్ఎస్పీ 22వ జాతీయ మహాసభలు ప్రారంభం
న్యూఢిల్లీ : ప్రజా వ్యతిరేక విధానాలు అమలులో నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ముందుకు నడుస్తోందని ఆర్ఎస్పీ జాతీయ ప్రధాన కార్యదర్శి మనోజ్ భట్టాచార్య తెలిపారు. శుక్రవారం నాడిక్కడ స్థానిక కాన్ట్సిట్యూషన్ క్లబ్లో ఆర్ఎస్పీ 22వ జాతీయ మహాసభలు ప్రారంభం అయ్యాయి. తొలిత ఎర్ర జెండాను ఆవిష్కరించారు. అనంతరం అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులు అమరవీరుల స్థూపానికి నివాళుర్పించారు. తరువాత మూడు రోజుల పాటు జరిగే ఈ మహాసభల్లో చర్చించాల్సిన నిర్మాణ నివేదికను మనోజ్ భట్టాచార్య ప్రవేశపెట్టారు. బీజేపీ ప్రభుత్వం మతోన్మాద, కార్పొరేట్ విధానాలను అవలంభిస్తోందని, దీనికోసం అన్ని సంస్థలను ఉపయోగించుకుంటుందని విమర్శించారు. నూతన విద్యా విధానంతో విద్యా వ్యవస్థనే మార్చేందుకు కుట్ర జరుగుతోందని దుయ్యబట్టారు. ఆర్ఎస్పీ ఎంపీ ఎన్కె ప్రేమ్ చంద్రన్, కేరళ రాష్ట్ర కార్యదర్శి శిబు బేబి జాన్, కేంద్ర కార్యదర్శి వర్గ సభ్యులు అశోక్ ఘోష్, ప్రోగ్రెస్సివ్ స్టూడెంట్స్ యూనియన్ జాతీయ కార్యదర్శి మహమ్మద్ షఫి ఉల్లా, ఏపి, తెలంగాణ నేతలు జానక రాములు, సుబ్బరాయుడు, కళ్యాణ్ చిన్నయ్య వివిధ రాష్టాల ప్రతినిధులు పాల్గొన్నారు. నేడు (శనివారం) జరిగే సభలో వామపక్ష పార్టీల నేతలు పాల్గొంటారు.