Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజీవ్‌గాంధీ హత్య కేసులో సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో మొత్తం ఆరుగురు దోషుల్నీ తక్షణమే విడుదల చేయాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. వారంతా జీవిత ఖైదు శిక్ష పడి 30 ఏళ్లకు పైగా శిక్ష అనుభవిస్తున్నారు. నళిని, రవిచం ద్రన్, జయకుమార్, సుధెంధిరరాజా అలియాస్ శాంతన్, మురుగన్, రాబర్ట్ పయాస్లను విడుదల చేయాలని ఆదేశించింది. ఈ దోషుల ముందస్తు విడుదలకు 2018 సెప్టెంబర్‌లో గవర్నర్‌కు తమిళనాడు క్యాబినెట్ సిఫార్సు చేసిన విషయాన్ని జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ బివి నాగరత్నలతో కూడిన ధర్మాసనం ప్రస్తావించింది. అలాగే, ఈ కేసులో మూడు దశాబ్దాలకు పైగా జైలు శిక్ష అనుభవించిన దోషి ఎ.జి. పేరరివాళన్‌ను విడుదల చేయాలని ఈ ఏడాది మే 18న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. పేరరివాళన్ విడుదల తరువాత తమను కూడా ముందస్తుగా విడుదల చేయాలని కోరుతూ నళిని, రవిచంద్రన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. పేరరివాళన్ కేసులో తీర్పే వీరికీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. నళిని, రవిచంద్రన్‌లతో పాటు మిగతా నలుగుర్ని కూడా విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. ఇతర కేసుల్లో వీరికి జైలు శిక్ష లేకపోతే వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని స్పష్టం చేసింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తరువాత, కేంద్రం సహా అందరి అభిప్రాయాలను స్వీకరించిన తర్వాతే వీరి విడుదలకు తీర్పు ఇచ్చినట్లు సుప్రీంకోర్టు తెలిపింది. ఈ దోషులంతా శిక్షఅనుభవిస్తూ పిజిలు పూర్తి చేశారని, శాంతన్ కవితలు రాసి జర్మనీలో అవార్డులు కూడా గెలుచుకున్నాడని తెలిపింది. ప్రస్తుతం ఈ ఆరుగురు దోషులు తమిళనాడులోని వేల్లూరు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. 1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరంబుదూరులో రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు.