Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆయా వర్సిటీల్లో ఫీజుల వివరాలు కూడా ఇవ్వండి
- కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన వైద్య విద్యార్థులు విదేశీ వర్సిటీల్లో చేరడానికి ఎక్కడెక్కడ ఎన్ని సీట్లు ఉన్నాయో వివరాలు ఇవ్వాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆయా వర్సిటీల్లో రుసుముల వివరాలు కూడా చెప్పాలని కోరింది. దేశీయ వర్సిటీల్లో చదువుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన వైద్య విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్ను శుక్రవారం జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ విక్రమ్నాథ్లతో కూడిన ధర్మాసనం విచారించింది. కేంద్రం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి వాదనలు వినిపిస్తూ... ఆయా విద్యార్థులు చేరడానికి విదేశీ వర్సిటీల వివరాలు సెప్టెంబరు 15నే వెల్లడించామని తెలిపారు. నీట్ క్వాలిఫై అయినప్పటికీ దేశీయ వర్శిటీల్లో సీట్లు రాక వారంతా ఉక్రెయిన్ వెళ్లారని తెలిపారు. తెలంగాణ,ఏపీ విద్యార్థుల తరపుసీనియర్ న్యాయవాది సి. మోహన్ రావు, న్యాయవాది రమేశ్ అల్లంకిలు వాదనలు వినిపిస్తూ... నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనల ప్రకారం ఒక దేశం నుంచి ఇంకో దేశానికి విద్యార్థుల బదిలీ కుదరదనీ, అదేవిధంగా మొబిలిటీ అవకాశం కూడా లేదని తెలిపారు. 15 వర్సిటీల వివరాలు ఇచ్చినప్పటికీ మొబిలిటీ, ట్రాన్స్ఫర్లపై స్పష్టత ఇవ్వలేదని తెలిపారు. ఉక్రెయిన్ వర్శిటీల్లోని ఫ్యాకల్టీ వచ్చి ఆయా వర్సిటీల్లోని విద్యార్థులకు వైద్య విద్య అందించడానికి తగిన వసతులు ఏర్పాటు చేస్తామని, అపోలో కళాశాల ముందుకొచ్చిందని తెలిపారు. ఈ విషయాన్ని పరిశీలించాలని ధర్మాసనాన్ని విజ్ఞప్తి చేశారు. అనంతరం.. ఏయే వర్సిటీల్లో ఖాళీలున్నాయి? ఎన్ని సీట్లు ఉన్నాయి? ఫీజుల వివరాలేంటి? అనే అంశాలపై అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణ నవంబరు22కు వాయిదా వేసింది.