Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వాగతం పలికిన గవర్నర్, సిఎం
విశాఖ: రాష్ట్రంలో రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం విశాఖపట్నానికి చేరుకున్నారు. మధురైలో వర్షం కారణంగా అరగంట ఆలస్యంగా రాత్రి 8.04 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయనకు బిజెపి నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎయిర్ పోర్టు నుంచి ఐఎన్ఎస్ చోళాకు వెళ్లారు. దారిలో తన వాహనం నుంచే ప్రజలకు అభివాదం చేశారు. అక్కడ మోడీకి రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి వెంట స్పీకర్ తమ్మినేని సీతారాం, ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, తూర్పునౌకాదళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్ గుప్తా, డిజిపి రాజేంద్రనాథ్‌రెడ్డి, జెడ్పి చైౖర్‌పర్సన్ జె.సుభద్ర ఉన్నారు. శనివారం ఉదయం పది గంటలకు ఎయు ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సభలో ప్రధాని ప్రసంగించనున్నారు.
ప్రత్యేక పరిస్థితుల్లో భేటీ : పవన్
ఐఎన్ఎస్ చోళాలో ప్రధాని మోడీతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. అనంతరం విశాఖ నోవాటల్లో రాత్రి 9.45 గంటలకు మీడియాతో పవన్ మాట్లాడారు. ప్రధానితో 8 సంవత్సరాలు తర్వాత సమావేశమైనట్లు ఆయన చెప్పారు. ఇది ప్రత్యేక పరిస్థితుల్లో జరిగిన భేటీ అని ఆయన పేర్కొన్నారు. దాదాపు అరగంట పాటు సాగిన ఈ సమావేశం అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ తెలుగు ప్రజలు అభివృద్ధి చెందాలనేది ప్రధాని ఆకాంక్ష అని చెప్పారు. 'ప్రత్యేక పరిస్థితుల్లో ఈ భేటీ జరిగింది. సమావేశంలో అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారని, తన అవగాహన మేరకు వివరాలు తెలియజేశానన్నారు. ఈ సమావేశం ఎపికి మంచి రోజులు తీసుకొస్తాయని, మంచి రోజులు తీసుకొస్తానని గాఢంగా నమ్ముతున్నట్లు పవన్ తెలిపారు.
పోర్టు హార్బర్ గెస్ట్‌హౌస్‌లో జగన్ బస
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిఎంను కలిశాక విశాఖలోని పోర్టు హార్బర్ గెస్ట్‌హౌస్‌కు రాత్రి 9 గంటలకు చేరుకున్నారు. రాత్రికి అక్కడే బస చేశారు. శనివారం ఉదయం 9.30 గంటలకు ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్స్‌లో ప్రధాని మోడీ... రాష్ట్రానికి, విశాఖకు చెందిన రూ.15,233 కోట్ల విలువైన ఐదు పథకాలకు శంకుస్థాపన, ఆరు పథకాలకు ప్రారంభోత్సవ చేయనున్నారు. ఆ తర్వాత ఎయు మైదానంలో జరిగే సభలో ప్రధాని మోడీ, సిఎం వైఎస్ జగన్ ప్రసంగించనున్నారు.