Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళితుల ఆత్మగౌరవంపై హిందూత్వాన్ని రుద్దడానికే : కేంద్ర అఫిడవిట్‌పై ఏఐఏడబ్ల్యూయూ
న్యూఢిల్లీ : మతం మారిన దళితులు ఓబీసీలు ఎలా అవుతారని ఏఐఏడబ్ల్యూయూ ప్రశ్నించింది. దళితుల ఆత్మగౌరవం మీద హిందుత్వాన్ని రుద్దడానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తున్నాయనీ, అందులో భాగంగానే సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసిందని విమర్శించింది. రాజ్యాంగ హక్కులు దళితులకు దక్కకుండా, ఆయా వర్గాలను సమాజానికి దూరం చేసేందుకు సుప్రీంకోర్టులో ప్రభుత్వం దాఖలుచేసిన అఫిడవిట్‌ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. క్రైస్తవ, ఇస్లాం మతాలను స్వీకరించిన దళితులకు ఎస్సీ రిజర్వేషన్లు, ఇతర ప్రయోజనాలు వర్తించవంటూ ప్రభుత్వం దాఖలుచేసిన అఫిడవిట్‌ను వ్యతిరేకించాలని ప్రజలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు ఏఐఏడబ్ల్యూయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విజయరాఘవన్, బి.వెంకట్లు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం దళితులపై తన మనుస్మృతి ఎజెండాతో కత్తి కట్టిందనీ విమర్శించారు. ఎస్సీలు మతం మారితే రిజర్వేషన్ కుదరదని దళితులపై బీజేపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫడవిట్ వెయ్యడం ద్వారా మరోమారు తన కులదురహంకార వివక్ష బయట పెట్టుకుందన్నారు. దళితుల హక్కులను కాలరాసే చర్యల్లో భాగంగానే బీజేపీ ప్రభుత్వం ఇలా చేసిందని విమర్శించారు. హిందూ సమాజంలో ఉన్న అణచివేత క్రైస్తవ, ఇస్లాం సమాజంలోనూ ఉందని సూచించేందుకు ప్రామాణిక సమాచారం అందుబాటులో లేదనీ, ఎస్సీలకు అర్హులైన ప్రయోజనాలను మతం మారిన దళితులకు ఇవ్వలేమని కేంద్రం తప్పుడు వాదనలను పెట్టిందని ఆరోపించారు. రాజ్యాంగ ఉల్లంఘన లేదని చెబుతూ... మోసపూరిత వాదన చేసిందని విమర్శించారు. ఇప్పటికీ మతం మారినా కులవివక్ష మారలేదనీ, దాడులు, దౌర్జన్యాలు, కులదురంకార హత్యలు ఆగలేదనీ, కులవివక్ష, అంటరానితనం పోలేదని వారు స్పష్టంచేశారు.