Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 68 అసెంబ్లీ స్థానాలు
- ఓట్లు 55,74,793
- పోలింగ్ స్టేషన్లు 7,881
న్యూఢిల్లీ : హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు నేడు (శనివారం) జరగనున్నాయి. ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 68 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. మొత్తం ఓటర్ల సంఖ్య 55,74,793, అందులో 18 ఏళ్ల నిండిన తొలిసారి ఓటు హక్కు పొందిన ఓటర్లు 43,173 మంది ఉన్నారు. 80 ఏండ్ల వయసు పైబడిన ఓటర్ల సంఖ్య 1,22,093, వికలాంగు ఓటర్ల సంఖ్య 56,001, థర్డ్ జండర్ ఓటర్ల సంఖ్య 37 అని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకున్న 80 ఏండ్ల వయసు పైబడినవారు, అదేవిధంగా అంగవైకల్యం గలవారు తమ ఇంటి వద్ద నుంచే ఇప్పటికే ఓటు హక్కును వినియోగించుకున్నారు. దరఖాస్తు చేసుకోలేని వృద్ధులకు, వికలాంగులకు పోలింగ్ స్టేషన్‌లోని గ్రౌండ్ ఫ్లోర్లో ఓటు వేసేందుకు ఏర్పాటుచేశారు. రాష్ట్రంలో ఉన్న 68 శాసన సభ స్థానాల్లో 17 ఎస్సీ, 3 ఎస్టీ రిజర్డ్వ్ స్థానాలున్నాయి. దాదాపు 1500 ఓటర్లకు ఒక పోలింగ్ స్టేషన్ ఏర్పాటుచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 7,881 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటుచేశారు. రాష్ట్రంలోని 68 స్థానాలకు వివిధ పార్టీల నుంచి 24 మంది మహిళలు సహా మొత్తం 412 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రాష్ట్రంలో 157 మహిళా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశామని, ఇక్కడ పోలింగ్ అధికారులు, సిబ్బంది, భద్రతా సిబ్బంది మహిళలే ఉంటారని ప్రధాన ఎన్నికల అధికారి మనీష్ గార్గ్ తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్‌లు మొత్తం 68 స్థానాల్లో పోటీ చేస్తుండగా, ఆప్ 67 స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టింది. సీపీఐ(ఎం) 11 స్థానాల్లో, బీఎస్పీ 53 స్థానాల్లో, సీపీఐ 1 స్థానంలో, ఇతర పార్టీలు 45 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. స్వతంత్ర అభ్యర్థులు 99 మంది బరిలో ఉన్నారు.