Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీని ఓడించేందుకు లౌకిక శక్తుల విస్తృత సమీకరణ
- కార్పొరేట్, మతోన్మాద మైత్రి... ప్రజా పోరాటాలతో ప్రతిఘటన
- ఆర్ఎస్పీ 22వ జాతీయ మహాసభల్లో సీతారాం ఏచూరి
- ఆర్ఎస్ఎస్ కేంద్రాలుగా రాజ్ భవన్లు : డి.రాజా
న్యూఢిల్లీ : బీజేపీని ఒంటరి చేసి ఓడించడానికి లౌకిక శక్తుల విస్తృత సమీకరణను ముందుకు తీసుకెళ్లేందుకు వామపక్ష ఐక్యతను బలోపేతం చేయాలని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపు ఇచ్చారు. ఢిల్లీలోని కాన్ట్సిట్యూషన్ క్లబ్లో ఆర్ఎస్పీ 22వ జాతీయ మహాసభలు జరుగుతున్నాయి. ఈ మహాసభలో ఆర్ఎస్పీ ప్రధాన కార్యదర్శి మనోజ్ భట్టాచార్య అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సమావేశంలో వామపక్ష పార్టీలతో పాటు కాంగ్రెస్ నేతలు సౌహార్థ సందేశాలిచ్చారు. తొలుత సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వ పాలనలో దేశం ప్రమాదంలో పడిందనీ, దీనిని ఎదుర్కొనేందుకు అందరం కలిసి ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. దేశాన్ని రక్షించేందుకు వచ్చే ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీని ఓడించాలని పిలుపు నిచ్చారు. పార్టీల మధ్య కొన్ని భిన్నాభిప్రాయాలుండొచ్చనీ, వాటిని పక్కన పెట్టాలని సూచించారు.
బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలపై గవర్నర్ల దాడి
దేశంలో ప్రజాస్వామ్యం, లౌకికవాదంపై ప్రస్తుత ప్రభుత్వం తీవ్రమైన దాడి చేస్తున్నదనీ, దీన్ని ఎదుర్కొనేందుకు సైద్ధాంతిక పోరాటం చేయాలన్నారు. దేశ లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాన్ని, ఫాసిస్ట్ హిందూత్వ రాజ్యంగా మార్చేందుకు తీవ్ర ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. దేశ రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్నారనీ, అలాగే స్వతంత్ర రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేసి వాటి అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారని ఏచూరి విమర్శించారు.
పార్లమెంటులో ఎటువంటి చర్చ, ప్రజా సమస్యలు పరిగణనలోకి తీసుకోవడం వంటివి ఉండవనీ, న్యాయ వ్యవస్థ, ఎన్నిక సంఘం వంటివి ఎలా ఉన్నాయో అందరికీ తెలుసన్నారు. ఈడీ, సీబీఐ చర్యలు చాలా అధ్వాన్నంగా ఉన్నాయనీ, అవి ప్రభుత్వానికి రాజకీయ ఏజెన్సీలుగా ఉన్నాయని విమర్శించారు. గవర్నర్లను నియమించి బీజేపీయేతర ప్రభుత్వాలపై దాడికి పూనుకుంటున్నారనీ, కేరళ, తమిళనాడు, తెలంగాణల్లో గవర్నర్లు ఎలా వ్యవహరిస్తున్నారో చూస్తున్నామని అన్నారు. రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులపై కూడా సంతకాలు చేయటం లేదని విమర్శించారు.
రాజ్యాంగ నిర్మాణం ధ్వంసం
రాజ్యాంగ మూల స్థంబాలైన ఆర్థిక స్వతంత్రత, లౌకిక ప్రజాస్వామ్యం, సమాఖ్య వ్యవస్థ, సామాజిక న్యాయం కూడా దాడికి గురవుతున్నాయనీ, అందుకోసం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చట్టాలను కూడా చేస్తున్నారని విమర్శించారు. ముస్లిం మైనార్టీలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారనీ, అందుకు ఆయా చట్టాలకు హక్కులు ఇస్తున్నాయని తెలిపారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని లౌకికవాదం సందిగ్ధతలో ఉందన్నారు. మతానికి సంబంధించిన కార్యక్రమాలను ప్రభుత్వ కార్యక్రమంగా చేయడం ఇదే మొదటిసారని తెలిపారు.
హిందూ మత కార్యక్రమాల్లాగే, ఇతర మతాల కార్యక్రమాలను ప్రధాని మోడీ నిర్వహిస్తారా? అని ప్రశ్నించారు. పూజారులు చేయాల్సిన కార్యక్రమాలను కూడా ప్రధాని చేయడం దారుణమనీ, మతం, ప్రభుత్వం మధ్య ఎటువంటి తేడా లేదనే సందేశం ఇస్తున్నారని విమర్శించారు. ఇండియా హిందూత్వ దేశంగా మార్చడంలో ఇది భాగమని, దేశ రాజ్యాంగ నిర్మాణాన్ని ధ్వంసం చేసేందుకు హిందూత్వ శక్తులు పూనుకుంటున్నాయని దుయ్యబట్టారు.
దేశంలో కార్పొరేట్, మతోన్మాద మైత్రి చాలా దఢంగా ఉందనీ, మనముందున్న ఈ సవాలును ప్రజా పోరాటాల బలోపేతంతోనే ప్రతిఘటించగలమని పేర్కొన్నారు. నిరుద్యోగం, ఆకలి, ధరలు పెరుగుదల, ప్రజల భారాలు పెరిగాయని తెలిపారు. దేశంలో ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు పోరాడుతున్నాయనీ, దేశ సంపద లూటీకి వ్యతిరేకంగా పోరాటాలు, రైతుల లాంగ్ మార్చ్‌లు జరుగుతున్నాయని తెలిపారు. బ్రిటిష్ నుంచి రాజకీయ స్వాతంత్య్రం వచ్చిందనీ, దాన్ని ఆర్థిక స్వాతంత్య్రంగా మార్చాలని వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయని తెలిపారు.
సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ కేంద్రాలుగా రాజ్భవన్లున్నాయని అన్నారు. కాంగ్రెస్ తన వైఖరి మార్చుకోవాలనీ, ఎట్టి పరిస్థితుల్లోనూ హిందూత్వాన్ని తలకెత్తుకోవద్దని సూచించారు. కాంగ్రెస్ సెంటర్ లెఫ్ట్గానే ఉండాలనీ, సెంటర్ రైట్ కాకుడదని స్పష్టంచేశారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ మాట్లాడుతూ బీజేపీ, ఆర్ఎస్ఎస్కు వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఐక్యంగా ఉండాలన్నారు. బలమైన కాంగ్రెస్ లేకపోతే, బలమైన ప్రతిపక్షం ఉండదని తెలిపారు. ఫార్వర్డ్ బ్లాక్ ప్రధాన కార్యదర్శి దేవ రాజన్, సీపీఐఎంఎల్ లిబరేషన్ పొలిట్ బ్యూరో సభ్యుడు రవి రారు తదితరులు మాట్లాడారు.