Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'సుప్రీం'లో మోడీ సర్కారు తీరు సరికాదు
- ముస్లిం, క్రైస్తవ దళితులకు ఎస్సీ హౌదాపై నిపుణులు
న్యూఢిల్లీ: దేశంలోని ముస్లింలు, క్రిస్టియన్ల లోని దళిత వర్గాలను ఎస్సీ జాబితాలో చేర్చకుండా కేంద్రం మొండిగా వ్యవహరిస్తున్నదని నిపుణులు అన్నారు. వారిని ఎస్సీ జాబితాలో చేర్చవచ్చా? లేదా? అన్నది తేల్చేందుకు భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి కె.జి బాలకృష్ణన్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసినప్పటికీ.. కేంద్రం వారికి హౌదా నిరాకరించటం తొందర పాటు చర్య అని తెలిపారు. ఈ తీరు ఏ మాత్రమూ సరికాదన్నారు. ఈ విషయంపై ఇటీవల కేంద్రం.. దేశ సర్వోన్నత న్యాయస్థానంలో అఫిడవిట్‌ను దాఖలు చేసింది. పై రెండు వర్గాలకు ఎస్సీ హౌదాను వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ విషయం మీద ఇటు ముస్లిం, క్రిస్టియన్లలోని దళిత వర్గాలు, నిపుణుల నుంచి వ్యతిరేకత వస్తున్నది.
ప్రభుత్వ వైఖరి దేశంలోని దళిత క్రైస్తవులు, దళిత ముస్లింల వాస్తవికతను తుడిచిపెట్టిందని నిపుణులు చెప్పారు. కేంద్రం వైఖరి సమస్యాత్మకమై నదని హక్కుల న్యాయవాది, నేషనల్ దళిత్ క్రిస్టియన్ వాచ్ అధినేత విన్సెంట్ మనోహరన్ అన్నారు. ''సామాజికంగా, విద్యాపరంగా అట్టడుగున ఉన్న వారికి ఎస్సీ హౌదా ఇవ్వబడుతుందనేది బాగా స్థిరపడిన సూత్రం. మరోమాటలో చెప్పాలంటే, కుల వ్యవస్థ కారణంగా అంటరానితనం అనే కళంకాన్ని ఎదుర్కొనే వారికి ప్రత్యేక హక్కు ఇవ్వబడుతుంది'' అని ఆయన చెప్పారు. 1950 వరకు అంటరాని తనంతో బాధపడుతున్న వర్గాలను వర్గీకరించటానికి మతం అర్హత ప్రమాణంగా పరిగణించబడలేద న్నారు. 1950 నాటి ప్రెసిడెంట్ ఆర్డర్లో పేరా 3 హిందూ మతం కాకుండా ఇతర విశ్వాసాలను మినహాయించటాన్ని మాత్రమే ప్రస్తావించిందని మనోహరన్ ఎత్తి చూపారు.
కేంద్రం వాదనలను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో పీహెచ్డీ పరిశోధకులు, ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ 'ఎంగేజ్' మాజీ ఎడిటర్ అయిన షిరీన్ ఆజం వ్యతిరేకించారు. 'ముస్లింలలో కులం అదృశ్యం' అనే అంశంపై ఆజం పరిశోధన చేస్తున్నారు. సుప్రీం కోర్టులో కేంద్రం తీసుకున్న వైఖరిని విమర్శించారు. పైన పేర్కొన్న రెండు మతాలలోని దళితులు తమ మతంలో, సమాజంలోనూ కులం పేరుతో వివక్షను ఎదుర్కొంటున్నారని నిరూపించటానికి సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అనేక పత్రాల ఉనికిని ఆజం లాగే మనోహరన్ ఎత్తి చూపారు. ప్రభుత్వ వాదన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్, ఐక్యరాజ్యసమితి చార్టర్లు, ఒప్పందాల సూత్రాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా లేదని ఆయన వాదించారు. ఆ రెండు మతాలపై వివక్ష వాదనలను అణగదొక్కటానికి ప్రభుత్వం 'విదేశీ మతం' మార్గాన్ని కూడా అవలంభించిందని నిపుణులు చెప్పారు. అగ్రవర్ణ పేదలలో ఆర్థికంగా వెనకబడిన వారి కోసం తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై ఉన్న శ్రద్ధ ఈ విషయంలో మోడీ ప్రభుత్వానికి లేదని ఆరోపించారు. ఈ విషయంలో మోడీ ప్రభుత్వ వైఖరి తీవ్ర నిరాశను కలిగించిందని ముస్లిం, క్రైస్తవ దళిత సంఘాలు తెలిపాయి. తమను సాకుగా చూపి హిందూత్వ సిద్ధాంతంతో రాజకీయంగా లాభపడా లన్న ఆశ తప్ప మరేమీ కేంద్రం తీరులో కనిపించటం లేదని ఆరోపించాయి. సమాజంలో అంటరాని తనంతో క్షోభను అనుభవిస్తున్న తమకు మోడీ సర్కారు తీరు షాక్‌కు గురి చేసిందన్నారు.