Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విచారణకు కనీసం రెండేండ్లు...యూపీలో కేసులు అధికం
- చట్టం అమల్లోకి వచ్చి నేటికి పదేండ్లు
- సామాజిక కార్యకర్తల ఆందోళన
న్యూఢిల్లీ : లైంగికదాడి నేరాల నుంచి చిన్నారులకు రక్షణ కలిగించే చట్టం పోక్సో యాక్ట్. ఈ చట్టం దేశంలో అమలులోకి వచ్చి నేటికి (నవంబర్ 14) సరిగ్గా పదేండ్లు. అయితే, పోక్సో కేసుల్లో విచారణ తీరు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నది. ఇలాంటి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు ఎట్టకేలకు నిర్దోషులుగా బయటపడుతున్నారు. ప్రతి ముగ్గురు నిర్దోషులుగా తేలితే ఒకరు మాత్రమే దోషిగా శిక్షను అనుభవిస్తున్నారు. దేశవ్యాప్తంగా పోక్సో చట్టం కింద నమోదవుతున్న కేసుల సంఖ్య అధికంగానే ఉన్నది. కానీ ఆ కేసుల విచారణకు అధిక సమయమూ పడుతున్నది. ఇది న్యాయవ్యవస్థలో పోక్సో కేసుల విషయంలో న్యాయవ్యస్థ తీరును ఎత్తి చూపుతున్నదని సామాజిక కార్యకర్తలు తెలిపారు. కాగా, ఈ సమాచారాన్ని ఢిల్లీ కేంద్రంగా పని చేసే విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ వివరించింది.
చాలా వరకు కేసులు కనీసం రెండేండ్ల వరకు సమయాన్ని తీసుకుంటున్నాయి. పోక్సో కింద నమోదైన మొత్తం కేసుల్లో 47.7 శాతం కేసుల విచారణకు ఏడాది కంటే తక్కువ సమయం పట్టింది. 1 నుంచి 2 ఏండ్ల మధ్య సమయం తీసుకున్న కేసుల సంఖ్య 26.9 శాతంగా ఉన్నది. 13.5 శాతం కేసుల పరిష్కారానికి రెండు నుంచి మూడేండ్ల సమయం తీసుకున్నది. ఇక 11.9 పోక్సో కేసుల విచారణకు మూడేండ్లకు పైగా సమయం పట్టటం గమనార్హం. ఈ కేసులలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు నిర్దోషులుగా బయటపడుతుండటం ఆందోళనకరంగా ఉన్నది.
ఈ అధ్యయనం చేసిన సంస్థ మొత్తం 1.12 లక్షల కేసులను పరిశీలించింది. ఇందులో నిర్దోషులుగా తేలిన కేసులు 43.4 శాతంగా (48,544 కేసులు) ఉన్నాయి. 14 శాతం కేసులు (15,675 కేసులు) దోషులుగా, బదిలీ అయిన కేసులు 22.8 శాతంగా (25,434 కేసులు) ఉన్నాయి. సిక్కింలోని నామ్చి జిల్లా.. ఈ-కోర్టుల్లో పోక్సో కింద ఒక లక్ష మంది జనాభాకు అధిక కేసులు నమోదైన జిల్లాగా ఉన్నది. ఇక్కడ మొత్తం 223 కేసులు నమోదయ్యాయి. రెండో స్థానంలో ఢిల్లీలోని న్యూఢిల్లీ జిల్లా నిలిచింది. తెలంగాణలోని మెదక్ నాలుగో స్థానంలో ఉన్నది. తెలంగాణ నుంచి ఆదిలాబాద్ కూడా ఈ జాబితాలో ఉన్నది. 2020లో కరోనా మహమ్మారి ప్రభావం పోక్సో కేసులపై పడింది. దీంతో చాలా వరకు కేసులు అలాగే నిలిచిపోయాయి. 2013లో 2,932 కేసులు పెండింగ్లో ఉండగా, 322 కేసులు మాత్రమే విచారణను ముగించాయి. 2019లో పెండింగ్ కేసుల సంఖ్య 93,993గా, విచారణ పూర్తైన కేసులు 28,471గా ఉన్నాయి. ఇక 2020లో మాత్రం ఆ సంఖ్య మరింతగా పెరిగింది. 1,18,856 కేసులు పెండింగ్లో ఉండగా, 19,658 కేసుల విచారణ పూర్తవటం గమనార్హం.
2013-2020 మధ్య పెండింగ్ కేసులు, విచారణ పూర్తయిన కేసులు రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే.. యూపీలో అత్యధికంగా మొత్తం 39వేలకు పైగా పోక్సో కేసులు ఈ-కోర్టుల్లో నమోదయ్యాయి. ఇందులో 30,823 పెండింగ్ కేసులు, 8,812 కేసులు విచారణ పూర్తయిన కేసులుగా ఉన్నాయి. రెండో స్థానంలో ఉన్న మహారాష్ట్రలో 19,432 పెండింగ్ కేసులు, విచారణ పూర్తయిన కేసులు 12,832గా ఉన్నాయి. మూడో స్థానంలో గుజరాత్ ఉన్నది. ఇక్కడ పెండింగ్ కేసులు 8,650గా, విచారణ పూర్తయిన కేసులు 8,117గా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో పెండింగ్ కేసులు 1554గా ఉండగా, విచారణ పూర్తయినవి 3,074గా ఉన్నాయి.
అయితే, పోక్సో చట్టం కింద నమోదైన కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరగాలని సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేశారు. ప్రస్తుత తీరును వారు తప్పుబట్టారు. పెండింగ్ కేసుల సంఖ్య మరింత తగ్గాలన్నారు. ఇందుకు న్యాయస్థానాలు, ప్రభుత్వాలు కృషి చేయాలని చెప్పారు.