Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏప్రిల్ 5న పార్లమెంట్ మార్చ్
- వ్యవసాయ కార్మికులు పెద్ద సంఖ్యలో తరలి రావాలి :
ఏఐఏడబ్ల్యుయూ జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్ పిలుపు
న్యూఢిల్లీ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సరళీకృత ఆర్థిక విధానాలను వేగంగా అమలు చేస్తూ కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను కట్టబెడుతుందని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్ విమర్శించారు. ఆదివారం కర్నాటకలోని మాండ్యాలో మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. శ్రామిక ప్రజల మధ్య అనైక్యతను సృష్టించేందుకు బీజేపీ హిందుత్వాన్ని ఉపయోగిస్తున్నదన్నారు. ఏకకాలంలో హిందుత్వం, కార్పొరేట్ విధానాలను ఓడించకుండా ప్రజలు త్యాగాలతో సాధించుకున్న హక్కులు చట్టాలను కాపాడుకోలేమని ఆయన అన్నారు. ఒక వైపు హిందూ, ముస్లింల మధ్య వైరుధ్యాలను పెంచుతూ మరోవైపు పాఠ్యాంశాలలో అంబేద్కర్, భగత్ సింగ్ లాంటి యోధుల చరిత్రలను తొలగిస్తున్నారని, బ్రిటిష్ వారికి కొమ్ముగాసిన వారి చరిత్రలను దేశభక్తులుగా చిత్రీకరించి పిల్లల మెదడులోకి ఎక్కిస్తున్నారని విమర్శించారు. ఇటు వంటి విష బీజాలను దేశవ్యాప్తంగా ఎదజల్లేటువంటి చర్యలను ప్రజలు ప్రతిఘటించాలని పిలుపు నిచ్చారు. డబుల్ ఇంజన్ అభివృద్ధి అంటే ప్రధాని దృష్టిలో అదానీ, అంబానీల అభివృద్ధి అని విమర్శించారు. మోడీ, అమిత్ షాలు కోరుకుంటున్న అభివృద్ధి కూడా అదేనని అన్నారు. వారు చెబుతున్న డబుల్ ఇంజన్ హిందుత్వ, కార్పొరేట్ అయితే వాటిని ఎదిరించడానికి కార్మికులు, కర్షకులు, కష్టజీవులు ఐక్యమయ్యారని అన్నారు. నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు ఆరు నెలల పాటు దేశవ్యాప్తంగా సభలు, సదస్సులు, పాదయాత్రలు, ఇంటింటి పర్యటనలు, వాలంటీర్ల రిక్రూట్మెంట్ వంటి అనేక కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో చేపట్టనున్నట్లు తెలిపారు. వ్యవసాయ కార్మికుల మౌలిక సమస్యలైన అందరికీ ఉపాధి, అందరికీ ఇల్లు, సాగుభూమి, సమానత్వం, సామాజిక న్యాయం, ఆహార భద్రత విద్యా వైద్యం లాంటి వాటిపై దేశవ్యాప్తంగా క్యాంపైన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన ఎనిమిదేండ్ల కాలంలో దేశంలో దళితులు మైనారిటీలు మహిళలపై దుర్మార్గమైన దాడులు పెరిగాయని మరొకవైపు లౌకిక రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి మనువాద రాజ్యాంగాన్ని బీజేపీ ప్రత్యామ్నాయంగా తీసుకొస్తుందని అన్నారు. అందులో భాగమే మతం మారితే ఎస్సీ రిజర్వేషన్లు ఉండవని సుప్రీంకోర్టులో బీజేపీ అఫిడవిట్ వేయటం లాంటిది అని చెప్పి చెప్పారు. ఈ దుష్ట విధానాన్ని ప్రకటించేందుకు ప్రజల ఉద్యమాల్లోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ బహిరంగ సభలో ఏఐఏడబ్ల్యూయూ ఉపాధ్యక్షులు నిత్యానంద స్వామి, కేంద్ర వర్కింగ్ కమిటీ సభ్యులు చంద్రప్ప, రాష్ట్ర నాయకులు బసవరాజు, మాజీ ఎమ్మెల్సీ ప్రకాష్, సామాజిక ఉద్యమ నాయకులు ప్రొఫెసర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.