Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర, రాష్ట్ర గ్రాంట్లపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి..
- విధుల నిర్వహణలో బలహీనపడుతున్నాయని హెచ్చరించిన ఆర్బీఐ నివేదిక
- స్థానిక సంస్థలు ప్రపంచంలోనే అత్యంత బలహీనం..
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా స్థానిక సంస్థలు తమ సొంత రాబడిని పెంచుకోవాలని, ఇందుకోసంగానూ సరికొత్త పద్ధతులు, ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాలని 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (ఆర్బీఐ) పేర్కొన్నది. ఆర్థిక నిర్వహణలో స్థానిక సంస్థల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో స్థానిక సంస్థలు ఎక్కువగా కేంద్ర, రాష్ట్ర గ్రాంట్లపైన్నే ఆధారపడుతున్నాయని తప్పుబట్టింది. ఈ తరహా పోకడల వల్ల మున్సిపాల్టీలు తమ విధుల్ని పూర్తి సామర్థ్యంమేరకు నిర్వర్తించ లేకపోతున్నాయని హెచ్చరించింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని 201 మున్సిపల్ కార్పొరేషన్లపై అధ్యయనం చేసి 'మున్సిపల్ ఫైనాన్సెస్' నివేదికను ఆర్బీఐ తాజాగా విడుదల చేసింది. ఈ నివేదికలో పేర్కొన్న విషయాలు ఈ విధంగా ఉన్నాయి.
అంతా రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో..
ఇతర దేశాలతో పోల్చుకుంటే, ఆర్థిక స్వతంత్రలో మన పట్టణ ప్రాంతాల్లోని స్థానిక సంస్థలు ప్రపంచంలోనే అత్యంత బలహీనంగా ఉన్నాయి. పన్నులు, వినియోగదారు ఛార్జీలు విధించటం, మినహాయిం పులు మంజూరు చేయటం, నిధుల కోసం రుణం తీసుకోవటం...ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే గ్రాంట్లపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. దీంతో విధులను నెరవేర్చటంలో సామర్థ్యం బలహీనపడింది. రాష్ట్ర ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి అధికార వర్గాలపై ఆధారపడటం పెరిగింది. పట్టణ ప్రాంతాల్లా వేగంగా పెరుగుతున్న జనాభా అవసరాలను దృష్టిలో పెట్టుకొని, వినూత్నమైన, సృజనాత్మక పద్ధతుల్లో ఆదాయాన్ని సమకూర్చుకోవాలి.
పనితీరులో మెరుగుదల ఏది?
దేశంలోని 201 మున్సిపల్ కార్పొరేషన్‌పై అధ్యయనం చేశామని ఆర్బీఐ నివేదిక పేర్కొన్నది. 1946-47 ఆర్థిక సంవత్సరం నాటితో పోల్చితే ఏ మున్సిపల్ కార్పొరేషన్ స్వీయ ఆదాయం పెరగలేదు. మొత్తం స్థానిక సంస్థల ఆదాయం, ఖర్చు దేశ జీడీపీలో ఒక్కశాతం వద్దే ఆగిపోయింది. ఇదే అంశం ఇతర దేశాలతో పోల్చుకుంటే, బ్రెజిల్లో 7.4శాతం, దక్షిణాఫ్రికాలో 6శాతముంది. రాజ్యాంగబద్ధంగా స్థానిక సంస్థల ఏర్పాటు జరిగినా, మున్సిపల్ కార్పొరేషన్ల పనితీరులో గణనీయమైన మెరుగుదల లేదు. సొంత ఆదాయాలు కూడా బలహీనంగా ఉన్నాయి. దాంతో అవి అందించే సేవలు కూడా దెబ్బతింటున్నాయి.