Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐబీ, నిఘా వర్గాలకు అమిత్ షా ఆదేశాలు
- ప్రతి రాష్ట్రంలో వారి జాబితా రూపొందించాలని సూచన
న్యూఢిల్లీ : వలసదారుల పేరిట మైనార్టీలపై అణచివేతలకు మోడీ సర్కార్ సిద్ధమైంది. ప్రతి రాష్ట్రంలో అక్రమ వలసదారులను గుర్తించి, నిర్బంధించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. వారిని దేశం నుండి వెళ్లగొట్టాలని ఉన్నతస్థాయి ఇంటెలిజెన్స్ అధికారులను ఆదేశించారు. పొరుగు దేశాలు వారిని అనుమతించక పోయినా..వలసదారులను తరిమికొట్టాలని నిఘా వర్గాలను ఆదేశించినట్టు మీడియాలో వార్తలు వెలువడ్డాయి. అన్ని రాష్ట్రాల సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరోస్ (ఎస్ఐబీ)లతో ఈనెల 9న నిర్వహించిన సమావేశంలో..అధికారులకు విధిగా లక్ష్యాలను నిర్దేశించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రతిరాష్ట్రంలో దాదాపు 100మందికిపైగా చొరబాటుదారులను గుర్తించాలని, వారి గుర్తింపు పత్రాలను తనిఖీ చేయాలని, అవసరమైతే అరెస్టులు చేయాలని ఆదేశించినట్టు ఆ వర్గాలు తెలిపాయి. పంజాబ్లో సిక్కులు క్రైస్తవ మతంలోకి మారిన ఘటనలను ప్రస్తావిస్తూ.. క్రైస్తవ మత మార్పిడి ఘటనలు జరగకుండా చూడాలని ఆదేశించినట్టు సమాచారం.
ఉత్తరప్రదేశ్, బీహార్ సరిహద్దు జిల్లాల్లో ముస్లిం జనాభా పెరుగుదలపై ఇంటెలిజెన్స్ బ్యూరో ఇచ్చిన సమాధానంపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారని మీడియాలో వార్తలు వెలువడ్డాయి. దేశంలో వలసదారులు, చొరబాటుదారులను అడ్డుకోవాలంటూ అమిత్ షా లక్ష్యాలను నిర్దేశించడం ఇదే మొదటిసారి కాదు. చొరబాటుదారు లను గుర్తించి ఓటర్ల జాబితా నుండి తొలగించాలంటూ 2018లో ఎన్డీయే ప్రభుత్వం ఆదేశించింది. అమిత్ షా ఆదేశాల మేరకు 2019 అసోంలో 19లక్షల మంది పౌరులను జాతీయ పౌరసత్వ నమోదు (ఎన్ఆర్సీ) నుండి తొలగించిన సంగతి తెలిసిందే. ఇదే విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలంటూ ఆదేశించారు. ఎన్ఆర్సీ అనేది చట్టబద్ధమైన భారతీయ పౌరులుగా ఉన్నవారి అధికారిక రికార్డు. ఈ జాబితాను అసోం ప్రభుత్వం నిర్వహిస్తోంది. కేంద్రం చేపట్టిన ఎన్ఆర్సీ ప్రక్రియ అత్యంత వివాదాస్పదమైంది. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీలను లక్ష్యంగా చేసుకొని ఎన్ఆర్సీని చేపట్టాలనే ఆలోచనలో మోడీ సర్కార్ ఉంది.