Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పథకం నిబంధనల్లో మార్పులపై పిటిషన్ దాఖలు
న్యూఢిల్లీ : ఎన్నికల బాండ్ల పథకంలో మార్పులు చేస్తూ..కేంద్రం జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ కొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ను సుప్రీం విచారణకు స్వీకరించిందని సోమవారం బార్ అండ్ బెంచ్ మీడియాకు తెలిపింది. తగిన ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ జరుపుతుందని భారత ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్ తెలిపారు. బాండ్ల పథకంపై నవంబర్ 7న కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. దీంట్లో...అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఏడాది అదనంగా 15రోజులు, సార్వత్రిక ఎన్నికలు జరిగే ఏడాది అదనంగా 30 రోజులు బాండ్ల పథకాన్ని ప్రవేశపెడతామని నిబంధనల్ని సవరించింది. దీనిని సవాల్ చేస్తూ సీనియర్ న్యాయవాది అనూప్ చౌదరి సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. కేంద్రం తీరుపై ప్రతిపక్ష నాయకులు, సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. అత్యంత వివాదాస్పదంగా బాండ్ల పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చారని, చట్టసభల ఆమోదం లేకుండా ఆర్థిక బిల్లుతో పథకాన్ని ప్రవేశపెట్టారని పలు ఎన్జీవో సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయి.
మోడీ సర్కార్ 2018లో బాండ్ల పథకాన్ని ప్రవేశపెట్టింది. వ్యక్తులు, కార్పొరేట్ సంస్థలు ఈ బాండ్లను కొనుగోలు చేసి ఆయా రాజకీయ పార్టీలకు విరాళాలు అందజేయవచ్చు. అయితే ఈ పథకంలో బడా కార్పొరేట్ సంస్థలు, అత్యంత ధనికులు తెరవెనుక కేంద్ర ప్రభుత్వం నుండి ప్రయోజనాలు పొందుతున్నారని, అందుకు ప్రతిగా పెద్దమొత్తంలో బాండ్ల పథకం ద్వారా విరాళాలు అందజేస్తున్నారని ఆరోపణలున్నాయి. ప్రతిఏటా జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ నెలల్లో 10 రోజులపాటు బాండ్ల పథకాన్ని కేంద్రం ప్రవేశపెడుతోంది. గుజరాత్, హిమాచల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక..మరో వారం రోజులు (నవంబర్లో) బాండ్ల అమ్మకాన్ని చేపట్టింది. అక్టోబర్లో 10రోజులు..బాండ్ల అమ్మకాలు జరిగాయి. ఆ వెంటనే మరుసటి నెలలోనే పథకాన్ని తీసుకురావటంపై పాలకుల తీరు అనుమానాస్పదంగా ఉంది. బాండ్ల పథకం చట్టబద్ధతపై ఇప్పటికే సుప్రీంలో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటి విచారణ పెండింగ్లో ఉంది. ఇప్పటివరకూ బాండ్ల పథకం ద్వారా బీజేపీకి వేల కోట్ల రూపాయల విరాళాలు దక్కాయి. మొత్తం విరాళాల్లో 90శాతానికిపైగా బీజేపీ దక్కటం గమనార్హం.