Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీంకు తెలియచేసిన కేంద్రం
న్యూఢిల్లీ : ఆరాధనా స్థలాల చట్టం చెల్లుబాటుపై తన వైఖరిని వివరించేందుకు మరికొంత సమయం కావాలని కేంద్రం సోమవారం సుప్రీం కోర్టుకు తెలియచేసింది. నిర్దిష్ట స్థాయిలో సవివరమైన చర్చలు జరపడం అవసరమని పేర్కొంది.1991లో తీసుకువచ్చిన ఈ చట్టం 1947 ఆగస్టు 15నాటికి వున్న రీతిలోనే మతపరమైన ఆరాధనా స్థలాల స్వభావాన్ని, గుర్తింపును పరిరక్షించాలని కోరుతోంది. దీనిపై కేంద్రం తన వైఖరిని అఫిడవిట్ రూపంలో డిసెంబరు 12కల్లా అందచేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ ఆదేశించింది. జనవ రి మొదటి వారంలో దీనిపై విచారణ జరిపేందుకు కోర్టు అంగీకరించింది. గతంలో కూడా ఈ కేసులో ప్రభుత్వం ఇలాగే రెండు సార్లు వాయిదా కోరిందని పిటిషనర్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయ వాది రాకేష్ ద్వివేది తెలిపారు. రామజన్మభూమి కేసులో రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఆరాధనా స్థలాల చట్టం చెల్లుబాటు సమస్యను పరిష్కరించిందా లేదా అని అక్టోబరు 10న కోర్టు ప్రభుత్వాన్ని కోరింది. అయితే భిన్నమైన సందర్భంలో అయోధ్య తీర్పు ఇవ్వబడినందున, బహుశా ఈ అంశం ఇందులో ఇమిడి వుండకపోవచ్చని కేంద్రం తరపున వాదనలు వినిపిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు. అయోధ్య తీర్పులోని వ్యాఖ్యలు కేవలం న్యాయమూర్తుల యాదృచ్ఛిక అభిప్రాయ వ్యక్తీకరణ అంటూ రాకేష్ ద్వివేది అంగీకరించారు. కాగా, అయోధ్య కేసులో రాజ్యాంగ ధర్మాసనం 1991 నాటి చట్టం చెల్లుబాటును పరిశీలించలేదని మరో ఇద్దరు పిటిషనర్ల తరపు న్యాయవాదు లు పేర్కొన్నారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా అనేక పిటిషన్లు సుప్రీం కోర్టులో దాఖలయ్యాయి. కటాఫ్ డేట్ను 1947 ఆగస్టు 15గా అక్రమంగా నిర్ధారించారంటూ ఆ పిటిషన్లు పేర్కొంటున్నాయి. చారిత్రకంగా జరిగిన తప్పును సరిదిద్దాలన్నదే ఈ పిటిషన్ల ప్రధాన లక్ష్యంగా వుంది.
బలవంత మత మార్పిడి చాలా తీవ్ర విషయం
బలవంతపు మత మార్పిడిని చాలా తీవ్రమైన అంశంగా సుప్రీం కోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. ఈ పద్ధతిని కట్టడిచేసేందుకు నిజాయితీగా కృషి చేయాలని కేంద్రాన్ని కోరింది. ఈ పద్ధతిని తక్షణమే నిలుపు చేయకపోతే చాలా క్లిష్టమైన పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరించింది. తక్షణమే దీన్ని అదుపు చేసేందుకు చర్యలు తీసుకోవాల్సి ందిగా జస్టిస్ ఎం.ఆర్.షా, హిమా కొహ్లిలతో కూడిన ధర్మాసనం కోరింది. మీరేం చర్యలు తీసుకుంటున్నారో కూడా మాకు చెప్పండని కోరింది. బెదిరింపులు, అవరోధాలు, బహుమతులు, నగదు ప్రయోజనాలు వంటి మోసపూరితంగా ఆకర్షక విధానాల ద్వారా మత మార్పిడికి అక్రమంగా పాల్పడడాన్ని నియంత్రించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ కోరారు.