Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిసెంబర్ 1 నుంచి 11 వరకు ఎంపీలకు వినతులు
- ఎస్కేఎం జాతీయ సమావేశం పిలుపు
న్యూఢిల్లీ : కనీస మద్దతు ధరతో పాటు రైతు సమస్యలపై నవంబర్ 26న అన్ని రాష్ట్రాల్లో రాజ్భవన్లకు పాదయాత్రలు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) పిలుపునిచ్చింది. ఎస్కేఎం జాతీయ స్థాయి సమావేశం సోమవారం నాడిక్కడ గురుద్వారా శ్రీ రాకబ్ గంజ్ సాహిబ్‌లో జరిగింది. బూటా సింగ్ బుర్జ్‌గిల్, రమీందర్ సింగ్ పాటియాలా, జగ్తార్ సింగ్ బజ్వాతో కూడిన ప్యానెల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏఐకెఎస్ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా, బీకేయూ నేత రాకేష్ టికాయత్, దర్శన్ పాల్, గుర్నామ్ సింగ్, ఆశిష్ మిట్టల్, సునీలం, సాహు, కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చారిత్రాత్మక రైతు ఉద్యమం విజయవంతమై ఏడాది కావస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఎస్‌కేఎంకు ఇచ్చిన హామీల్లో చాలావరకు నేటికీ నెరవేర్చలేదని విమర్శించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలకు ఎస్కేఎం పిలుపునిచ్చింది. గతేడాది నవంబర్ 19న రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్నట్టు ప్రధాని మోడీ ప్రకటించారనీ, అదే రోజు ఈ ఏడాది నవంబర్ 19న ఫతే దివస్‌గా నిర్వహించాలని ఎస్కేఎం నిర్ణయించింది. ఎస్కేఎం పిలుపుతో 2020 నవంబర్ 26న లక్షలాది మంది రైతులు ఢిల్లీకి వచ్చారనీ, ఈ ఏడాది అదే రోజున అన్ని రాష్ట్రాల్లో రాజ్భవన్లకు పాదయాత్రలు చేపట్టి, గవర్నర్లకు ఎస్కేఎం డిమాండ్లతో పాటు ఆయా రాష్ట్రాల్లో ప్రత్యేకమైన డిమాండ్లతో కూడిన వినతి పత్రాలు సమర్పించాలని నిర్ణయించింది. ఎస్కేఎం తదుపరి సమావేశం డిసెంబర్ 8న జరగనుందనీ, ఆ సమవేశంలో ఉద్యమ భవిష్యత్తు కార్యచరణను నిర్ణయిస్తామని పేర్కొంది. అలాగే ఆ సమావేశంలో 'పూర్తి స్థాయి రుణమాఫీ, ఎంఎస్పీ హామీ' కోసం పోరాటాన్ని ప్రకటిస్తామని తెలిపింది.