Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ, కెఆర్ఎంబీలకూ సుప్రీంకోర్టు నోటీసులు జారీ
న్యూఢిల్లీ : కృష్ణా జలాల వినియోగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ జెన్కో, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ అజరు రస్తోగి, జస్టిస్ సిటి రవికుమార్లతోకూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది జయదీప్ గుప్తా వాదనలు వినిపిస్తూ.. రాష్ట్ర విభజన తరువాత 2015లో కుదిరిన జల ఒప్పందాలను తెలంగాణ ఉల్లంఘిస్తోందన్నారు. శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణా జలాల వాడకానికి జీవోలు విడుదల చేసిందని ఆరోపించారు. దీనివల్ల ఏపీకి కలుగుతున్న నష్టాన్ని వివరించారు. జలాశయం నుంచి రెండు రాష్ట్రాలు నీరు వాడుకుంటున్నాయనీ, అయితే ఏపీ సమ్మతి లేకుండానే జల విద్యుదుత్పత్తికి తెలంగాణ ప్రభుత్వం నీరు విడుదల చేసిందన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని నదీ జలాలు, ప్రాజెక్టుల నిర్వహణపై కేంద్రం నదీ యాజమాన్య బోర్డులు ఏర్పాటుచేసిందన్నారు. ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలు బోర్డులు తీసుకున్నాయని తెలంగాణ తరపు సీనియర్ న్యాయవాది వైద్యనాధన్ తెలిపారు. జలాశయాలకు సంబంధించిన వివరాలు ఏపీ ప్రభుత్వం కేఆర్ఎంబీకి అప్పగించిందనీ, తెలంగాణ అప్పగించలేదని జరుదీప్ గుప్తా తెలిపారు.
బోర్డు అధికారాలపై ధర్మాసనం ఆరా తీయగా... జలాశయాలు, హెడ్‌వర్క్స్, కాలువలు, ప్రాజెక్టులు ఇలా అన్నింటినీ బోర్డు నియంత్రిస్తుందని తెలిపారు. తెలంగాణ నుంచి పురోగతి ఏంటని ధర్మాసనం ప్రశ్నించగా.. కేంద్ర మంత్రి చైర్‌పర్సన్‌గా ఉన్న అపెక్స్ కౌన్సిల్‌కు వెళ్లామని వైద్యనాధన్ తెలిపారు. ఇరుపక్షాల వాదనల అనంతరం బోర్డు ఏర్పడిన తరువాత పురోగతిపై కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ జెన్కో, కెఆర్ఎంబిలకు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని, తదుపరి రెండువారాల్లో రిజాయిండర్ దాఖలు చేయాలని పేర్కొంది. జనవరి రెండో వారం మంగళవారానికి విచారణ వాయిదా వేసింది.