Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీజేఐ జస్టిస్ చంద్రచూడ్‌కు అమికస్ క్యూరీ నివేదిక
న్యూఢిల్లీ : 2021 డిసెంబర్ నాటికి తాజా, మాజీ ఎంపీ, ఎమ్మెల్యేలపై 4,984 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని అవికస్క్యూరీ రిపోర్టు స్పష్టం చేసింది. అందులో 2018 నాటికి 4,122 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్‌కు అవికస్క్యూరీ విజరు అన్సారీ 17వ రిపోర్టును సోమవారం అందజేశారు. న్యాయవాది అశ్వీని కుమార్ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌ను సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం మంగళవారం విచారించనుంది. ఈ సందర్భంగా దేశంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలపై పెండింగ్‌లో ఉన్న కేసుల జాబితాను సీజేఐకు అందజేశారు. దేశంలో 2018 నాటికి 1,675 మంది తాజా, మాజీ ఎంపీలు, 2,324 మంది తాజా, మాజీ ఎమ్మెల్యేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంది. 1,991 కేసుల్లో చార్జస్ పెండింగ్‌లో ఉన్నాయనీ, 2,007 కేసుల్లో ట్రైయిల్ పెండింగ్ ఉందని తెలిపింది. 264 కేసులు హైకోర్టులు, సుప్రీంకోర్టు స్టే విధించడంతో పెండింగ్‌లో ఉన్నాయనీ, 430 కేసులు జీవిత ఖైదీ, మరణ శిక్షల వద్ద పెండింగ్‌లో ఉన్నాయి తెలిపింది. అందులో 180 మంది సిట్టింగ్ ఎంపీ, ఎమ్మెల్యే కాగా, 250 మంది మాజీ ఎంపీ, ఎమ్మెల్యేలని పేర్కొంది.
2021 డిసెంబర్ నాటికి 4,984 కేసులు పెండింగ్‌లో ఉన్నాయనీ, ఇందులో 1,899 కేసులు ఐదేండ్లకు పైబడి పెండింగ్‌లో ఉన్నాయనీ, 1,475 కేసులు రెండేండ్ల నుంచి ఐదేండ్ల మధ్య పెండింగ్‌లో ఉన్నాయనీ, 1,599 కేసులు రెండేళ్ల లోపే పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. 2018 అక్టోబర్ 4 తరువాత 2,775 కేసులు కొట్టివేసినట్లు రిపోర్టులో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ 92 మందిపై కేసులు ఉండగా, అందులో 50 కేసులు ఐదేళ్లకు పైబడే పెండింగ్‌లో ఉన్నాయని, తెలంగాణ హైకోర్టు రిపోర్టు ఇవ్వలేదని తెలిపింది. 25 హైకోర్టుల్లో 16 హైకోర్టులు రిపోర్టు సమర్పించాయని, 9 హైకోర్టులు రిపోర్టులు అందజేయలేదని తెలిపింది. ఉత్తరప్రదేశ్, చత్తీస్‌గఢ్, హిమాచల్‌ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లడక్, మేఘాలయా, రాజస్థాన్, బీహార్, సిక్కిం రాష్ట్రాలు రిపోర్టు ఇవ్వలేదని అమికస్ క్యూరీ తన రిపోర్టులో పేర్కొంది.