Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్యాంగ సంస్థలపై..సమాఖ్య వ్యవస్థపై దాడులు : పినరయి విజయన్
పాలక్కాడ్ : దేశవ్యాప్తంగా సహకార రంగాన్ని కేంద్రం నాశనం చేస్తోందని కేరళ సీఎం పినరయి విజయన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దేశంలో సహకార రంగానికి వందేండ్ల చరిత్ర ఉందని, సామాన్య ప్రజల జీవనానికి ఈ రంగం చాలా ముఖ్యమని ఆయన అన్నారు. సోమవారం పాలక్కాడ్లో 'ఆల్ ఇండియా కోఆపరేటివ్ వీక్' సదస్సును ప్రారంభిస్తూ ఆయన పై వ్యాఖ్యలు చేశారు. సహకార రంగంలో వచ్చిన మార్పులపై సమాజంలో చర్చ నడుస్తోందని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఆందోళన వ్యక్తం చేశాయని తెలిపారు. కోఆపరేటివ్ సొసైటీలపై సర్వాధికారం రాష్ట్రాలదేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందనే విషయాన్ని గుర్తుచేశారు. అయితే నోట్లరద్దు, ఇతర విధానపరమైన నిర్ణయాలతో మోడీ సర్కార్ ఈ రంగాన్ని దెబ్బకొట్టిందని, రాజ్యాంగ సంస్థలపై, సమాఖ్య వ్యవస్థలపై దాడులు పెరిగాయని అన్నారు. అలాగే దేశంలోని సహకారరంగాన్ని కూడా దెబ్బతీయాలని చూస్తున్నారని ఆరోపించారు.
''కొత్త కొత్త ఆదేశాలు జారీచేస్తూ సహకార రంగంలో కేంద్రం జోక్యం చేసుకుంటోంది. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతిస్తూ అనేక విషయాల్లో కలుగజేసుకుంటోంది. చట్టాల్ని అతిక్రమిస్తోంది. ఇవన్నీ కూడా సహకార రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కేరళలో సహకార రంగం బలోపేతంగా ఉండటం వల్ల ధరల పెరుగుదలను చాలా వరకు ఎల్డీఎఫ్ ప్రభుత్వం అడ్డుకోగలిగింది. నోట్లరద్దు తర్వాత సహకార రంగం దారుణంగా దెబ్బతిన్నది. అయినా..దీనిని తిరిగి నిలుపుకున్నా''మని చెప్పారు. కోఆపరేటివ్ సొసైటీల్లో నల్లడబ్బు ఉందని కేంద్రంలోని పాలకులు ఆరోపించారని, తద్వారా ఈ రంగాన్ని దెబ్బతీసే విధంగా పనిచేశారని విజయన్ అన్నారు.