Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రయాగ్‌రాజ్ : భారీగా పెంచిన ఫీజులను తగ్గించాలనే డిమాండ్‌తో అలహబాద్ యూనివర్సిటీ విద్యార్థులు మంగళవారం 'జన ఆక్రోష్ మార్చ్'ను నిర్వహించారు. విద్యార్థి సంఘాలను పునరుద్ధరించాలని, పెంచిన ఫీజులను రద్దు చేయాలనే డిమాండ్్తో యూనివర్సిటీ విద్యార్థులు గత 70 రోజుల నుంచి నిరాహార దీక్షలు చేస్తున్నారు. అయినా యూనివర్సిటీ అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో మంగళవారం మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు అజరు యాదవ్ సామ్రాట్ మాట్లాడుతూ 'పెంచిన ఫీజులను ఉపసంహరించుకోవాలన్న డిమాండ్‌తో పాటు, వైస్‌ఛాన్సలర్ సంగీత శ్రీవాస్తవ అక్రమ నియామకానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళనకు దిగారు' అని తెలిపారు. గత 70 రోజులుగా విద్యార్థులు నిరాహార దీక్షలు చేస్తున్నా వైస్‌ఛాన్సలర్ పట్టించుకోవడం లేదని, విసి తన మొండి వైఖరిని వీడడం లేదని సామ్రాట్ ఆరోపించారు. 70 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థుల్లో సామ్రాట్ ఒకరు. మార్చ్ కోసం స్టూడెంట్ యూనియన్ బిల్డింగ్ వద్దకు భారీ సంఖ్యలో విద్యార్థుల చేరుకున్నారు. పోస్టర్లు పట్టుకుని నినాదాలు చేశారు. విద్యార్థుల మార్చ్ సందర్భంగా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఇప్పటి వరకూ ఏడాదికి రూ.975గా ఉన్న అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ఫీజును ఒక్కసారిగా 300 శాతానికి పైగా పెంచి రూ.4,151కు చేర్చారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.