Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అఫిడవిట్ దాఖలు చేయండి
- హైకోర్టులకు సుప్రీంకోర్టు నోటీసులు
- కేరళ రాష్ట్రం అనుభవాలను పంచుకుంటూ అఫిడవిట్ ఇవ్వాలని ఆదేశం
న్యూఢిల్లీ : గ్రామ న్యాయాలయాల ఏర్పాటుపై స్పందన తెలపాలని దేశంలోని హైకోర్టులకు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. గ్రామ న్యాయాలయ చట్టం-2008 అమలు చేసేలా, గ్రామ న్యాయాలయాలు ఏర్పాటుచేసేలా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ సొసైటీస్ ఫర్ ఫాస్ట్ జస్టిస్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్, జస్టిస్ వి రామ సుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. అన్ని హైకోర్టుల రిజిస్ట్రార్ జనరల్‌లకు నోటీసు జారీచేసింది. గ్రామ న్యాయస్థానాలను ఏర్పాటుచేసిన కేరళ వంటి రాష్ట్రాల అనుభవాలను పంచుకుంటూ అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. ఈ పిటిషన్లో తీర్పు ఇవ్వడానికి హైకోర్టుల స్పందన కూడా అవసరమని పేర్కొన్న ధర్మాసనం, ఈ కేసులో హైకోర్టులను ప్రతివాదులుగా చేర్చింది. పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపిస్తూ దాదాపు 14 ఏండ్ల క్రితమే చట్టాన్ని ఆమోదించినా, చాలా రాష్ట్రాలు ఒక్క గ్రామ న్యాయాలయాన్ని కూడా ఏర్పాటుచేయలేదని అన్నారు. సీపీసీ, సీఆర్పీసీ కఠినమైన విధానానికి కట్టుబడి ఉండేందుకు గ్రామ న్యాయస్థానాల స్థాపనను చట్టం పేర్కొందనీ, నిర్దేశిత స్వభావం గల చిన్న కేసులను పరిష్కరించేందుకు వీలు కల్పిస్తుందని తెలిపారు. చట్టంలో ''షల్'' అనే పదానికి బదులు ''మే'' అనే పదాన్ని ఉపయోగించడం వల్ల రాష్ట్రాలు గ్రామ న్యాయాలయాల ఏర్పాటు తప్పనిసరి కాదని కేంద్ర ప్రభుత్వం వైఖరి తీసుకుందని ధర్మాసనానికి తెలిపారు. కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వంటి చాలా తక్కువ రాష్ట్రాలే ఈ చట్టాన్ని అమలు చేశాయని ఆయన సూచించారు.
గ్రామ న్యాయాలయాల ఏర్పాటును ఏ రాష్ట్రమైనా వ్యతిరేకిస్తుందా? అని ధర్మాసనం ప్రశ్నించింది. హైకోర్టు సిఫార్సు చేసినప్పటికీ హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకిస్తోందని ప్రశాంత్ భూషణ్ బదులిచ్చారు. బీహార్, జార్ఖండ్ వంటి రాష్ట్రాలు కూడా వ్యతిరేకిస్తున్నాయని ఆయన తెలిపారు. తమిళనాడులో ఇప్పటి వరకు ఒక్క గ్రామ న్యాయాలయాన్ని ఏర్పాటు చేయలేదని తెలిపారు. జార?ండ్ అదనపు అడ్వకేట్ జనరల్, సీనియర్ న్యాయవాది తపేష్ కుమార్ సింగ్ వాదనలు వినిపిస్తూ ఈ చట్టానికి, షెడ్యూల్డ్ తెగల ప్రాంతాల పరిపాలనకు సంబంధించిన చట్టాలకు మధ్య వైరుధ్యం ఉందని తెలిపారు. అందుకే తమ రాష్ట్ర ప్రభుత్వం దీనిని అమలు చేయలేదని పేర్కొన్నారు. షెడ్యూల్డ్ ప్రాంతాల పరిపాలనకు సంబంధించి ఈశాన్య రాష్ట్రాలకు చట్టం మినహాయింపు ఇచ్చిందని తెలిపారు. నిబంధనలను రూపొందించడం, నియామకాలను హైకోర్టులతో సంప్రదించి రాష్ట్ర ప్రభుత్వాలు చేయవలసి ఉన్నందున, ఈ కేసులో హైకోర్టులు కూడా పార్టీలుగా ఉండాలని తెలిపారు. దీంతో ఈ కేసులో హైకోర్టులను కూడా పార్టీలుగా చేర్చాలని ధర్మాసనం నిర్ణయించింది.
ప్రజాప్రతినిధుల వాక్ స్వాతంత్య్రంపై ఆంక్షలు విధించవచ్చా?
- విద్వేషపూరిత ప్రసంగాలు రాజ్యాంగ బద్ధమా?
- తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం
- 2014 తరువాత 450 శాతం పెరిగిన విద్వేషపూరిత ప్రసంగాలు
ఆర్టికల్ 19(2) విధించిన పరిమితుల కంటే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో సహా ప్రజా ప్రతినిధులు మాట్లాడే వాక్ స్వాతంత్య్రం కలిగి ఉండాలా? వద్దా? అనేదానిపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. ఈ పిటిషన్‌ను మంగళవారం జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ బిఆర్ గవారు, జస్టిస్ ఎఎస్ బోపన్న, జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ బివి నాగరత్నలతో కూడిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం విచారించింది.
'ఒక మంత్రి, పార్లమెంట్ సభ్యుడు ఈ రక మైన అవమానకరమైన వ్యాఖ్యలు, ద్వేషపూరిత ప్రసంగాలు చేయవచ్చా? ఇది రాజ్యాంగబద్ధమా? ఇది రాజ్యాంగ నైతికతకు అనుగుణంగా ఉందా? ఈ వాక్ స్వేచ్ఛపై రాజ్యాంగ పరిమితులు ఉన్నాయా?' అని జస్టిస్ నాగరత్న ప్రశ్నించారు. మంత్రులతో సహా ప్రజా ప్రతినిధులకు స్వచ్ఛంద ప్రవర్తనా నియమావళిని తాము సూచిస్తున్నా మనీ, దీనిని పరిష్కరించడానికి ప్రత్యేక విధానాన్ని కూడా తాము సూచిస్తున్నామని తెలిపారు. ఒక వ్యక్తి ప్రకటన దేశానికి వ్యతిరేకంగా ఉండకపోవచ్చు, కానీ దాని కారణంగా దేశ ప్రజల్లో ఒక వర్గం ప్రభావితమైతే అప్పుడేం చేస్తామని ప్రశ్నించారు.
2014 తరువాత 450 శాతం పెరిగిన ద్వేషపూరిత ప్రసంగాల సంఖ్య
శాసనసభ రూపొందించాల్సిన స్వచ్ఛంద ప్రవర్తనా నియమావళిని తాము సూచిస్తున్నామనీ, పార్లమెంట్ సభ్యులు, ప్రధానమంత్రి, రాష్ట్రపతి కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేసిన 20 సందర్భాలను తాము సూచించామని న్యాయవాది రాజ్ తెలిపారు. 2014 తరువాత ద్వేషపూరిత ప్రసంగాల సంఖ్యలో 450 శాతం పెరిగిందనీ, వీటిలో ప్రధాన భాగం మంత్రులు, పార్లమెంట్ సభ్యులతో సహా ప్రజా ప్రతినిధులే ఉన్నారని తెలిపారు. అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి జోక్యం చేసుకొని ఈ అంశాన్ని పార్లమెంట్ పరిష్కరించగలదని, ప్రభుత్వం, రాష్ట్రంపై ఒక మంత్రి చేసిన ప్రకటనకు బాధ్యత అనేది నిర్వహించలేని ప్రతిపాదనగా ఉంటుందని అన్నారు.
దాన్ని పరిష్కరించగల సామర్థ్యం పార్లమెంట్‌కు ఉందనీ, ప్రభుత్వం పరిశీలిస్తుం దని తెలిపారు. దీనికి ధర్మాసనం జోక్యం చేసుకొని ''మీరు పార్లమెంట్ చేస్తుందని అంటున్నారు. కానీ ఇప్పటికే నిబంధనలు ఉన్నాయి. కాబట్టి అదనంగా ఏదైనా అవసర మైతే, అది పార్లమెంటు చేయాలా?'' అని ప్రశ్నించింది. అమికస్ క్యూరీ విజరు హన్సారీ వాదనలు వినిపిస్తూ దేశంలో రాజ్యాంగం ఉందని, ఇక్కడ బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులకు పరిమితులు ఉన్నాయని తెలిపారు. అయితే ఇది అంతర్లీరంగా ఉంటుందనీ, కోర్టుకు ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు.