Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 135 మంది ప్రాణాలు పోయాక రాష్ట్ర ప్రభుత్వం మేల్కొంది..
- ఒప్పంద గడువు ముగిశాక నిర్వహణ పనులు
- వీటికి రాష్ట్ర ప్రభుత్వమే సమాధానం చెప్పాలి : గుజరాత్ హైకోర్టు
- ఘటనపై చాలా తెలివి చూపుతోంది... మోర్బీ మున్సిపాలిటీకి కోర్టు అక్షింతలు
న్యూఢిల్లీ : మోర్బీ బ్రిడ్జి కుప్పకూలి 130 మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనపై గుజరాత్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ''అవగాహనా ఒప్పందం గడువు ముగిసినా, బ్రిడ్డి నిర్వహణ అంతా అజంతా కంపెనీ చూస్తోంది. టెండర్ లేకుండా వంతెన మరమ్మత్తు పనులు అప్పగించారు. వీటన్నింటినిపైనా రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి'' అంటూ గుజరాత్ హైకోర్టు వ్యాఖ్యానించింది. 135 మంది ప్రాణాలు కోల్పోయిన మోర్బీ వంతెన ప్రమాద ఘటనపై గుజరాత్ హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. 150ఏండ్ల చరిత్ర కలిగిన బ్రిడ్జి మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ విషయంలో మోర్బీ మున్సిపాలిటీ ''చాలా తెలివిగా'' వ్యవహరించిందంటూ అక్షింతలు వేసింది. ప్రభుత్వ తప్పిదానికి 135 మంది ప్రాణాలు కోల్పోయారని, ప్రమాద జరిగాక రాష్ట్ర యంత్రాంగం స్పందించిందని కోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలుచేసిన అఫిడవిట్ సరైన వివరాలతో లేదని తప్పుబట్టింది. నోటీసు ఇచ్చినప్పటికీ ఇవాళ (మంగళవారం) ఒక్క అధికారి కూడా కోర్టు ముందుకు రాలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడింది. మున్సిపాలిటీ చీఫ్ ఆఫీసర్‌పై ఇంకా ఎందుకు క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది. దీనిపై కారణాలు తమకు అందజేయాలని ఆదేశించింది. ఒక పెద్ద రాష్ట్రం అయినప్పటికీ టెండర్ ప్రక్రియ చేపట్టకుండా కాంట్రాక్ట్ మంజూరు చేసినట్టు కనిపిస్తోందని హైకోర్టు పేర్కొన్నది. '' ప్రజలు సందర్శించే బ్రిడ్జి మరమ్మత్తు పనులకు ఎందుకు టెండరు పిలవలేదు? బిడ్లు ఎందుకు ఆహ్వానించలేదు?'' అని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ చీఫ్ జస్టిస్ అరవింద్ కుమార్ ప్రశ్నించారు. మంగళవారం ప్రారంభమైన కోర్టు విచారణ బుధవారం నాడూ కొనసాగనున్నది.
ఒకటిన్నర పేజీలో అగ్రిమెంటా?
ఒక ముఖ్యమైన పని పూర్తి చేసే విషయంలో ఒకటిన్నర పేజీలో అగ్రిమెంట్ ఎలా కుదుర్చుకుంటారని కోర్టు ప్రశ్నించింది. ఒరెవా సంస్థకు మెర్బీ బ్రిడ్జి పనులను 15 ఏండ్ల కాంట్రాక్ట్‌కు మున్సిపాలిటీ అప్పగించింది. ఎలాంటి టెండర్లు లేకుండా అజంతా కంపెనీకి పనులు ఎలా కట్టబెట్టారని కోర్టు నిలదీసింది. కోర్టు సుమోటోగా ఈ కేసును విచారణకు స్వీకరించింది. చీఫ్ జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ అశుతోష్ జె.శాస్త్రి ఈ కేసు విచారణ జరుపుతున్నారు. బ్రిడ్జి మెయింటెనెన్స్ పనులకు సంబంధించిన కాంట్రాక్ట్ ఫైల్స్‌ను తమ ముందు ఉంచాలని కోర్టు ఆదేశించింది. కాగా..ప్రమాదం జరిగిన వెంటనే చాలా వేగంగా ప్రభుత్వం స్పందించిందని, అనేక మంది ప్రాణాలు కాపాడినట్టు ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. ఈ ఘటనకు సంబంధించి 9మందిని ప్రభుత్వం అరెస్టు చేసిందని, దోషులుగా ఎవరు తేలినా వారిపై చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చే విషయం కోర్టు తెలుసుకోవాలనుకుంటోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.