Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేరళలో ఉన్నత విద్యా రంగాన్ని నాశనం చేస్తోంది: సీతారాం ఏచూరి
- రాజ్‌భవన్‌కు ఎల్డీఎఫ్ మెగా మార్చ్
తిరువనంతపురం : కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ తీరుపై రాష్ట్రంలోని అధికార ఎల్డీఎఫ్ తన పోరాటాన్ని ఉధృతం చేసింది. గవర్నర్ అధికారిక నివాసమైన రాజ్ భవన్‌కు మెగా మార్చ్‌ను చేపట్టింది. ఈ నిరసన ర్యాలీకి పార్టీ కార్యకర్తలు వేల మంది హాజరయ్యారు. ఈ మార్చ్‌ను సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ ప్రారంభించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు గవర్నర్ వ్యవస్థను వాడుకొని వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళ ఉన్నత విద్యా రంగాన్ని నాశనం చేసేందుకు బీజేపీ రాజ్యాంగ పదవులను దుర్వినియోగం చేస్తున్నదన్నారు. ''విద్య రాజ్యాంగం ఉమ్మడి జాబితాలో ఉన్నది. దానిపై రాష్ట్రాలకు సమాన హక్కులున్నాయి. అయితే, విద్యకు సంబంధించిన అన్ని విషయాలలో, బీజేపీ నేతృత్వంలోని కేంద్రం రాష్ట్రాలను దాటవేస్తున్నది'' అని ఆయన తెలిపారు. బీజేపీ తన రాజకీయ లక్ష్యాలను చేరుకోవటానికి రాష్ట్రంలోని ఉన్నత విద్యా రంగాన్ని నాశనం చేయటానికి ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. ఉన్నత విద్యా రంగాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవటం ద్వారా, భారతదేశాన్ని ఫాసిస్టు 'హిందూత్వ రాష్ట్ర'గా మార్చాలని బీజేపీ భావిస్తున్నదన్నారు. సీపీఐ(ఎం), ఇతర ఎల్డీఎఫ్ మిత్రపక్షాల నాయకులు, డీఎంకే రాజ్యసభ సభ్యుడు తిరుచ్చి శివ నిరసనలో పాల్గొన్నారు. విద్యా పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఈ ఆందోళనను నిర్వహించారు.
రాష్ట్రంలోని 11 మంది వీసీల రాజీనామాలను గవర్నర్ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజ్‌భవన్ ముందు, రాష్ట్రవ్యాప్తంగా ఇతర చోట్ల జిల్లా కేంద్రాల్లో ఎల్డీఎఫ్ నిరసనకు దిగింది. కేరళలోని 14 విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్‌గా ఉన్న గవర్నర్ నుంచి ఛాన్సలర్ పాత్రను తీసివేయటానికి ఆర్డినెన్స్ జారీ చేయాలని ప్రభుత్వం గత వారం ఆరిఫ్ ఖాన్‌కు సిఫారసు చేసింది. కేరళ యూనివర్సిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషన్ స్టడీస్ (కేయూఎఫ్‌ఓఎస్) వైస్ ఛాన్సలర్ (వీసీ) నియామకాన్ని కేరళ హైకోర్టు రద్దు చేసిన ఒక రోజు తర్వాత రాజ్‌భవన్‌కు మార్చ్ జరిగింది. యూసీసీ నిబంధనలు, 2018 ప్రకారం కొత్త వీసీని ఎంపిక చేసేందుకు కొత్త సెర్చ్ కమ్ సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేయాలని గవర్నర్‌ను కోర్టు ఆదేశించింది.
కేరళలో గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు పట్ల రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. గవర్నర్ తీరు రాజ్యాంగానికి లోబడి కనబడటం లేదన్నారు. ఒక రాజకీయ ఉద్దేశంతోనే ఆయన చర్యలు కనిపిస్తున్నాయని ఆరోపించారు. ముఖ్యంగా, కేంద్రంలోని బీజేపీ రాజకీయ లక్ష్యాలను సాధించటం కోసమే ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వ వ్యవహారాల్లో పరిధిని దాటి జోక్యం చేసుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు తెలిపారు. ఇందుకు తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో గవర్నర్లు వ్యవహరిస్తున్న తీరును వారు ఉదహరించారు. ఈ తరుణంలోనే కేరళలోనూ గవర్నర్ వ్యవహరిస్తున్న తీరుతో గొడవ రాజ్‌భవన్‌కు చేరుకున్నదని తెలిపారు. ప్రజాస్వామ్యం దేశంలో ఇది ఏ మాత్రమూ మంచిది కాదన్నారు.