Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-మోర్బీ మున్సిపాలిటీ యంత్రాంగంపై గుజరాత్ హైకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ : గుజరాత్‌లోని వంతెన ప్రమాద ఘటన కేసులో గుజరాత్ హైకోర్టు మోర్బీ మున్సిపాలిటీ యంత్రాంగం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ''మంగళవారం మీరు చాలా తెలివిగా వ్యవహరించారు. నేడు (బుధవారం) చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. కోర్టు నోటీసులకు సరైన విధంగా సమాధానం ఇస్తారా? రూ.లక్ష జరిమానా? కడతారా'' అంటూ హైకోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది. రెండుమార్లు నోటీసులు ఇచ్చినా మున్సిపాలిటీ యంత్రాంగం 'స్టేటస్ రిపోర్ట్' ఇవ్వటంలో ఆలస్యం చేస్తోందని తప్పుబట్టింది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల స్టేటస్ రిపోర్ట్ ఇవ్వటంలో జాప్యం అయ్యిందని, మున్సిపాలిటీకి ఇంచార్జ్‌గా ఉన్న డిప్యూటీ కలెక్టర్ ఎన్నికల విధుల్లో ఉన్నారని మున్సిపాలిటీ తరఫు న్యాయవాది హైకోర్టు ధర్మాసనానికి తెలియజేశారు.
అక్టోబర్ 30న మోర్బీ వంతెన ప్రమాద ఘటన జరిగింది. ఈ ఘటనలో 130మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దీనిని సుమోటోగా స్వీకరించిన హైకోర్టు మంగళ, బుధవారం కేసు విచారణ జరిపింది. దేశవ్యాప్తంగా ఎంతోమందిని కలిచివేసిన ఈ ప్రమాద ఘటనపై గుజరాత్ ప్రభుత్వంలోని ఆరు విభాగాల నుంచి న్యాయస్థానం నివేదికలు కోరింది. టెండర్ ప్రక్రియ చేపట్టకుండా అజంతా కంపెనీకి వంతెన నిర్వహణ పనులు ఎలా అప్పగిస్తారని న్యాయస్థానం ప్రశ్నించింది. వంతెనకు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఎవ్వరు ఇవ్వాలి? ఈ ప్రమాద ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అజంతా కంపెనీకి చెందిన 9మందిని పోలీసులు అరెస్టు చేశారు. వంతెన నిర్వహణ కోసం రూ.7కోట్లతో ఒప్పంద కుదుర్చుకున్న కంపెనీ ఉన్నతస్థాయి మేనేజ్మేంట్ను వదిలేసి, ఉద్యోగుల్ని అరెస్టు చేయటమేంటని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.