Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాల నేరస్థుడిగా పరిగణించకూడదు
- స్పష్టం చేసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : జమ్ముకాశ్మీర్‌లో ఎనిమిదేండ్ల బాలికపై సామూహిక లైంగికదాడి, హత్యకేసులో నిందితుడు శుభమ్ సంగ్రాను వయోజనుడిగా విచారించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆయనను బాల నేరస్థుడిగా పరిగణించ కూడదని పేర్కొంది. జమ్మూ కాశ్మీర్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు న్యాయ మూర్తులు జస్టిస్ అజరు రస్తోగి, జస్టిస్ జెబి పార్దీవాలాతో కూడిన ధర్మాసనం బుధవారం విచారిం చింది. ఈ ఘటన జరిగినప్పుడు సంగ్రాకు 18 ఏండ్ల నిండినట్టు వైద్యపరమైన ఆధారాలు స్పష్టం చేశాయనీ, మరే ఇతర చట్టబద్ధమైన ఆధారాలు లేనప్పుడు వైద్యపరమైన ఆధారాలనే సాక్ష్యంగా పరిగణిస్తామని ధర్మాసనం తెలిపింది. కథువా చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (సీజేఎం) జారీ చేసిన ఉత్తర్వులను, హైకోర్టు ఇచ్చిన తీర్పును అది పక్కన పెడుతున్నట్టు పేర్కొంది. బాధితురాలు 2018 జనవరి 17న మరణిం చింది. ఈ కేసులో నిందితులను క్రైం బ్రాంచ్ అరెస్టు చేయడంతో బీజేపీ-పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) ప్రభుత్వంలోని కొంతమంది మంత్రులతో సహా పలువురు రాజకీయ నాయకులు, న్యాయవాదులు, జమ్మూ లోని కొన్ని సంఘాలు నిందితులకు మద్దతుగా నిలిచారు. కథువాలోని న్యాయవాదుల బృందం క్రైమ్ బ్రాంచ్‌ను కోర్టు ముందు చార్జిషీట్ దాఖలు చేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఈ కేసు సున్నితత్వాన్ని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు 2018 మేలో విచారణను పఠాన్‌కోట్‌కు బదిలీ చేసింది. పఠాన్‌కోట్‌లోని ట్రయల్ కోర్టు 2019 జూన్‌లో ఈ కేసులో ఏడుగురు నిందితుల్లో ఆరుగురిని దోషులుగా నిర్ధారించింది. ఒకరిని నిర్దోషిగా ప్రకటించింది. ప్రధాన నిందితుడి శుభమ్ సంగ్రా వయస్సు పై వివాదాల కారణంగా ఆయనను జువైనల్‌గా కథువా సీజేఎం తీసుకున్న నిర్ణయం కారణంగా ఈ కేసులో అరెస్టు అయిన ఇతరులతో విచారణ జరగలేదు. సంగ్రాపై విచారణను జువైనల్ జస్టిస్ బోర్డుకు మార్చారు. నిందితుల తరపున న్యాయవాది నితిన్ సంగ్రా వాదనలు వినిపించారు.