Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రిటైలర్స్ సగటు ధరల ఆధారంగా నిర్ధారణ
న్యూఢిల్లీ : సెప్టెంబర్‌లో విడుదలైన 'అత్యావశ్యక ఔషధాల జాబితా'ను ఔషధ ధరల నియంత్రణ ఉత్తర్వుల పరిధిలోకి తీసుకొస్తున్నామని కేంద్రం ప్రకటించింది. అత్యావశ్యక ఔషధాల జాతీయ జాబితాను (ఎన్ఎల్ఈఎం) కేంద్ర ఆరోగ్య శాఖ సెప్టెంబర్‌లో విడుదల చేసింది. ఈ జాబితాలోని ఔషధాలన్నీ ఇకపై ధరల నియంత్రణ ఉత్తర్వుల పరిధిలోకి రాబోతున్నాయి. రిటైలర్స్ సగటు ధరల ఆధారంగా ఔషధ నియంత్రణ బోర్డు ధరల్ని నిర్ణయిస్తుంది. వీటి ప్రకారమే వినియోగదార్లకు జాబితాలోని ఔషధాల్ని విక్రయదార్లు అమ్మాల్సి ఉంటుంది. ఈ అంశంపై తాజాగా కేంద్రం ఒక గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. ఇటీవల కొత్తగా 34 ఔషధాల్ని ఎన్ఎల్ఈఎం జాబితాలో చేర్చారు. దీంతో జాబితాలో ఔషధాల సంఖ్య 384కు చేరుకుంది. కేంద్రం జారీచేసిన గెజిట్ ప్రకారం, ఇకపై ఈ ఔషధాల్ని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ధరలోనే అమ్మాల్సి ఉంటుంది. ఒక్కశాతం కంటే ఎక్కువ మార్కెట్ వాటా కలిగిన అన్నిరకాల జనరిక్, బ్రాండెడ్ జనరిక్ ఔషధాల రిటైలర్స్‌కు తాజా నిబంధనలు వర్తిస్తాయి. చిన్న రిటైలర్ మార్జిన్‌ను కూడా జోడించి సీలింగ్ ధర నిర్ణయించనున్నారు. దీంతో ఇకపై మధుమేహం, క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే ఔషధాల ధరలు కిందికి దిగి వస్తాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గర్భాశయ క్యాన్సర్‌కు ఔషధంగా వాడే హెప్పీవీ వ్యాక్సిన్లను, సార్వత్రిక ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్లోనివి కూడా ధరల నియంత్రణలోకి తీసుకురావాలని 'డీపీసీవో' (ఔషధ ధరల నియంత్రణ ఉత్తర్వు) నోటిఫికేషన్ సూచించింది.