Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టెక్ సమ్మిట్‌లో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : భారతదేశంలో పేదరిక నిర్మూలన కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒక ఆయుధంగా వాడుతున్నామని ప్రధాని మోడీ అన్నారు. ''మనదేశంలో చాలా ఏండ్లుగా సాంకేతికతను శక్తివంతమైనదిగానే చూశాం. దీనిని ఎలా ప్రజాస్వామ్యీకరించాలో చేసి చూపాం. సమానత్వం, సాధికారికతకు ఒక శక్తిగా నేడు సాంకేతికత ఉపయోగపడు తోంది'' అని ప్రధాని అన్నారు. బుధవారం 25వ బెంగుళూరు 'టెక్ సమ్మిట్'ను ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన వర్చువుల్ వీడియో ద్వారా ప్రసంగించారు. ''మొబైల్, డేటా విప్లవం భారత్‌లో స్మార్ట్ఫోన్ల విస్తరణకు సహాయపడింది. పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో మరింత వృద్ధికి దారితీసింది. ప్రభుత్వ ఆన్లైన్ పోర్టల్స్‌లో విద్యార్థుల కోసం అనేక ఆన్లైన్ విద్యా కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. కరోనా సంక్షోభ సమయంలో తక్కువ డేటా ఖర్చులతో పేద విద్యార్థులు ఆన్లైన్ తరగతులకు హాజరు కావడానికి సహాయపడింది. ఇది కూడా లేకపోతే విద్యార్థులు రెండేండ్లపాటు విద్యకు దూరమయ్యేవారు. భారతదేశం పేదరికంపై సాగిస్తున్న యుద్ధంలో సాంకేతికతను ఒక ఆయుధంగా ఉపయోగిస్తోంది'' అని ఆయన వివరించారు.
ప్రధాని మోడీ ఇండోనేషియాలోని బాలిలో జరుగుతున్న జీ-20 సదస్సుకు హాజరయ్యారు. బుధవారం అక్కడ్నుంచే వర్చువల్‌గా రికార్డ్ చేసిన సందేశాన్ని ప్రధాని మోడీ పంపారు. భారత్‌లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎంతో పెరిగిందని, సెమీ కండర్టర్లు, మరికొన్ని రంగాల్లో ఉత్పత్తి ప్రోత్సహాక పథకాలు మొదలయ్యాయని ఆయన ఈ వీడియో ప్రసంగంలో చెప్పుకొచ్చారు. పరిశ్రమలకు రెడ్ కార్పెట్ పరిచామన్నారు. అందువల్లే దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరిగాయన్నారు. చిన్న వ్యాపారులు ఈ-టెండర్లు దాఖలు చేయడానికి 'ఈ మార్కెట్‌ప్లేస్ పోర్టల్'ను తీసుకొచ్చామన్నారు. దీంతో వివిధ ప్రభుత్వ విభాగాల్లో టెండర్ సేవలు సులభతరంగా మారిందన్నారు.